Homeక్రైమ్కాజీపేటలో దారుణం.. తల్లిని గొంతు కోసి చంపిన కుమారుడు.. అసలు కారణమిదే!

కాజీపేటలో దారుణం.. తల్లిని గొంతు కోసి చంపిన కుమారుడు.. అసలు కారణమిదే!

వరంగల్ లోని కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం విషయంలో తల్లితో జరిగిన గొడవ చివరకు హత్యకు దారితీసింది. కన్న తల్లినే కుమారుడు హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

బాలాజీనగర్‌కు చెందిన నాగుల సుధాకర్, ఉదయశ్రీ దంపతులకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సుధాకర్ స్థానికంగా ఓ ప్రైవేట్ సంస్థలో అటెండర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు సమాచారం.

అయితే ఉదయశ్రీ కొంతకాలంగా సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ సమయం గడిపేవారని తెలుస్తోంది. ఈ క్రమంలో సుమారు నాలుగేళ్ల క్రితం కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తితో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ విషయం కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో ఇంట్లో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. తల్లి వ్యవహారశైలిని మార్చుకోవాలని కుమారుడు దొరబాబు పలుమార్లు చెప్పినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లలను, భర్తను విడిచిపెట్టి సదరు వ్యక్తితో కలిసి వెళ్లేందుకు ఉదయశ్రీ సిద్ధమైనట్లు సమాచారం.

తల్లి ఇంటి నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతున్న విషయం తెలుసుకున్న దొరబాబు ఆమెను బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి వివాహేతర సంబంధాన్ని కొనసాగించవద్దని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన దొరబాబు తల్లిపై దాడి చేసి గొంతు కోసినట్లు పోలీసులు తెలిపారు.

తీవ్రంగా గాయపడిన ఉదయశ్రీ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటన అనంతరం దొరబాబు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కాజీపేట పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న దొరబాబు కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

also read: ప్రణయ్ పరువు హత్య కేసులో మరో నిందితుడి మృతి.. జైలులోనే గుండెపోటు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు