2018లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో మరో నిందితుడు మృతి చెందాడు. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న అబ్దుల్ బారీ గురువారం గుండెపోటుతో కన్నుమూశాడు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న అతడికి ఛాతిలో నొప్పి రావడంతో జైలు అధికారులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
అబ్దుల్ బారీ మృతితో ప్రణయ్ హత్య కేసులో ఇప్పటివరకు ఇద్దరు నిందితులు మృతి చెందినట్లైంది. కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు 2020 మార్చి 8న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా అబ్దుల్ బారీ గుండెపోటుతో మృతి చెందాడు.
ప్రణయ్ హత్యతో సంచలనం
నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృత ప్రేమించి వివాహం చేసుకున్నారు. 2018 సెప్టెంబర్ 14న గర్భిణిగా ఉన్న అమృతను ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో ప్రణయ్‌పై కాంట్రాక్ట్ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. దళితుడైన ప్రణయ్‌ను కులాంతర వివాహం చేసుకున్న కారణంగానే ఈ హత్యకు కుట్ర జరిగిందనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర కలకలం రేపాయి.
ఈ కేసులో నల్లగొండ కోర్టు 2025 మార్చిలో తీర్పు వెలువరించింది. అబ్దుల్ బారీతో పాటు పలువురు నిందితులకు జీవిత ఖైదు విధించగా, ప్రణయ్‌పై దాడి చేసిన కాంట్రాక్ట్ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మకు మరణశిక్ష విధించింది.
మిగిలింది ఇద్దరు నిందితులే
అబ్దుల్ బారీ మృతితో ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరు నిందితులు మాత్రమే మిగిలారు. వారిలో కాంట్రాక్ట్ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మకు కోర్టు మరణశిక్ష విధించింది. మరో నిందితుడు, అమృత బాబాయి శ్రవణ్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
జీవిత ఖైదు శిక్షను సవాల్ చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించాడు. తన పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వాలని కోరాడు. అతడి వయసు, ఇప్పటికే అనుభవించిన జైలు జీవితం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
also read: బెంగళూరు స్టార్టప్ సంచలన నిర్ణయం.. ఆ 4 రాష్ట్రాల పురుషులకు ఉద్యోగాలు లేవట!
