Homeఆంధ్ర ప్రదేశ్తెలుగు రాష్ట్రాల్లో 'పెసా' చట్టం అమలుపై సినీ నటుడు రాహుల్ రామకృష్ణ ఆర్టీఐ దరఖాస్తు..

తెలుగు రాష్ట్రాల్లో ‘పెసా’ చట్టం అమలుపై సినీ నటుడు రాహుల్ రామకృష్ణ ఆర్టీఐ దరఖాస్తు..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో పెసా (పంచాయతీల షెడ్యూల్డ్ ప్రాంతాల విస్తరణ చట్టం 1996) చట్టం క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలవుతోందనే అంశం గురించి తెలుసుకునేందుకు సినీ నటుడు రాహుల్ రామకృష్ణ తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలను తెలుసుకోబోతున్నానంటూ నేరుగా ఆయనే ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అందులో ఆయన అడగాలనుకున్న ప్రశ్నలను కూడా తెలిపారు. అయితే అందులో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గ్రామసభల బలోపేతం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇప్పటి వరకు వాటి అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేశారంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన పరిణామాలపై గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి అత్యంత కీలకమైన పత్రాలు, ఫైళ్లు కావాలని రాహుల్ రామకృష్ణ కోరారు.

మరి దీనిపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి సమాధానం ఇస్తాయో చూడాలంటూ ఈ ఆర్టీఐ దరఖాస్తుల డిజిటల్ కాపీలను కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేయగా.. ఇప్పుడిది సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆర్టీఐ దరఖాస్తుల్లో ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో గ్రామసభల ఏర్పాటు, వాటి సరిహద్దుల గుర్తింపునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓలు), సర్క్యులర్ల కాపీలను కోరారు. ముఖ్యంగా గత ఎనిమిదేళ్లలో అంటే 2019 నుంచి 2026 వరకు జిల్లాల వారీగా ఎన్ని గ్రామసభలు నిర్వహించారు? వాటి హాజరు పట్టికలు, సమీక్షా యంత్రాంగాల నివేదికలు ఏవంటూ పిటిషనర్లు గట్టిగా నిలదీశారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, గవర్నర్ సచివాలయం నుంచి ‘పెసా’ చట్టం అమలులో లోపాలను ఎత్తిచూపుతూ వచ్చిన లేఖల తాలూకు వివరాలను కూడా బయటపెట్టాలని దరఖాస్తులో పేర్కొన్నారు.

వీటికి తోడు పెసా చట్టం అవగాహన సదస్సులు, శిక్షణా కార్యక్రమాల కోసం కేటాయించిన నిధులు ఎంత? వాటిలో ఎంత ఖర్చు చేశారు? అనే ఆర్థిక అంశాలపై జిల్లాల వారీగా, సంవత్సరాల వారీగా లెక్కలు కోరడం గమనార్హం. ఐటీడీఏ అధికారులు, గిరిజన ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణా నివేదికల కాపీలను కూడా సమర్పించాలని డిమాండ్ చేశారు.చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో మైనింగ్, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం భూమిని సేకరించే ముందు స్థానిక గ్రామసభల ముందస్తు అనుమతి లేదా సంప్రదింపులు తప్పనిసరి. అయితే రెండు రాష్ట్రాల్లో జరిగిన భూసేకరణ ప్రతిపాదనలు, వాటికి గ్రామసభలు ఆమోదం తెలుపుతూ చేసిన తీర్మానాలు, సమావేశాల నిమిషాల ప్రతులను ఇవ్వాలని రాహుల్ రామకృష్ణ ఆర్టీఐ దరఖాస్తులో కోరారు. నిర్వాసితులైన గిరిజన సామాజిక వర్గాల పునరావాసం విషయంలో చట్ట నిబంధనలను ఏ మేరకు పాటించారో చూపే రికార్డులను సైతం చూపించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు