Homeక్రైమ్8 నెలల గర్భిణి దారుణ హత్య.. కన్నబిడ్డల ముందే భార్యను చంపిన భర్త

8 నెలల గర్భిణి దారుణ హత్య.. కన్నబిడ్డల ముందే భార్యను చంపిన భర్త

క్రైం మిర్రర్ : ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం, జూదానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్న భార్యను కన్న పిల్లల ఎదుటే కొడవలితో దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. పన్వారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజ్రారీ గ్రామానికి చెందిన హనీఫ్ మన్సూరి, మనీషా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా మన్సూరి మద్యానికి, జూదానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనకున్న ఆస్తులను కూడా విక్రయించినట్లు సమాచారం.

మద్యం తాగేందుకు డబ్బులు కావాలంటూ మన్సూరి తరచూ భార్యను వేధించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అతడు మరోసారి మద్యం సేవించేందుకు ప్రయత్నించాడు. దీనిని భార్య మనీషా అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన మన్సూరి ఇంట్లో ఉన్న కొడవలితో భార్యపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన మనీషా అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన సమయంలో వారి చిన్నారులు కూడా అక్కడే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మన్సూరి పోలీసులకు ఫోన్ చేసి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే భయంతో ఉన్న ఐదేళ్ల కుమారుడు పోలీసులకు అసలు విషయం చెప్పడంతో ఘటన వెనుక నిజం బయటపడింది. సమాచారం అందుకున్న పన్వారీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

మృతురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మనీషాను భర్త చాలాకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నిందితుడి తండ్రి కూడా తన కుమారుడు చేసిన నేరం క్షమించరానిదని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. 
also read : కోనసీమలోని సరుగుడు తోటల్లో భారీ అగ్నిప్రమాదం – 20 ఎకరాలకు పైగా మంటల విస్తరణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు