Homeతెలంగాణపవన్ కొండంత అభిమానం.. మనసుకు హత్తుకుని ఆత్మీయత పంచిన వైనం!!

పవన్ కొండంత అభిమానం.. మనసుకు హత్తుకుని ఆత్మీయత పంచిన వైనం!!

క్రైమ్ మిర్రర్, వరంగల్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనలోని మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. అభిమానుల పట్ల ఉన్న తన ఆత్మీయతను మరోసారి నిరూపించుకున్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ కదలలేని స్థితిలో మంచానికి పరిమితమైన యువకుడిని స్వయంగా పరామర్శించారు. హన్మకొండలోని హనుమాన్ నగర్ కు చెందిన 17 ఏళ్ల యువ అభిమాని పొనుగోటి నిరంజన్ కోరికను మన్నించారు. నిరంజన్ దీనస్థితి గురించి తెలంగాణ జనసేన నేతల ద్వారా తెలుసుకున్నారు. బుధవారం నేరుగా హన్మకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు.

అరుదైన వ్యాధితో బాధపడుతూ..

17 ఏళ్ల నిరంజన్ డి ఎన్ డి అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా మంచానికే పరిమితం అయ్యారు. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ను చూడాలన్నదే నిరంజన్ కోరిక. ఆ విషయాన్ని తెలంగాణ జనసేన నేతల ద్వారా తెలుసుకున్న పవన్ హన్మకొండ వచ్చేందుకు నిర్ణయించారు. బుధవారం ఇంట్లోకి అడుగుపెడుతూనే లేవలేని స్థితిలో ఉన్న నిరంజన్ ను చూసి పవన్ చలించలేకపోయారు. ఏమాత్రం సంకోచించకుండా ఆ యువకుడి మంచం పైనే కూర్చుని.. అతన్ని ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టి ఓదార్చారు. చిన్నప్పటి నుంచి తనను చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని.. మీరంటే తనకు చాలా అభిమానం అని నిరంజన్ చెబుతుంటే పవన్ కళ్యాణ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నిరంజన్ గతంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పాటలకు వేసిన డాన్స్ వీడియోలను, ఫోటోలను సైతం తిలకించారు. అనంతరం తిరుపతి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పవిత్ర వస్త్రాన్ని నిరంజన్ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

లక్ష రూపాయల సాయం..

నిరంజన్ కోరిక మేరకు పరామర్శకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి అండగా నిలుస్తానని చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా లక్ష రూపాయల నగదును తల్లిదండ్రులు రామ్ గోపాల్, మానస లకు అందజేశారు. ఈ ఇద్దరు దంపతులు గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్లో పని చేసేవారు. అందుకే వారి జీవన ఉపాధి కోసం ఒక సరికొత్త క్యాంటీన్ ఏర్పాటు చేయించాలని అక్కడే ఉన్న తెలంగాణ జనసేన నాయకులకు ఆదేశించారు. నిరంజన్ తనకు కుక్కపిల్ల కావాలని కోరారు పవన్ కళ్యాణ్ ను. వెంటనే పవన్ కుక్క పిల్ల పెంచుకునేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని అక్కడే ఉన్న ఇంటి యజమానులను కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా పవన్ కళ్యాణ్ ను చూసేందుకు హన్మకొండలో అభిమానులు భారీగా బారులు తీరారు.

అమ్మవారి సన్నిధిలో పూజలు..

అటు తరువాత పవన్ కళ్యాణ్ వరంగల్ లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నిరంజన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడ పూజలు చేయించిన వెండి అమ్మవారి ప్రతిమను నిరంజన్ కుటుంబానికి అందజేయనున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో పవన్ కళ్యాణ్ పర్యటన పై ఎన్నెన్నో ఊహాగానాలు వచ్చాయి. కానీ పవన్ వరంగల్ జిల్లా పర్యటన సాఫీగా పూర్తయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు