బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. సినిమాలకే కాకుండా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో కూడా తరచూ వార్తల్లో నిలిచే అమీర్, తాజాగా ఓ వీడియో కారణంగా మళ్లీ అందరి దృష్టిలో పడ్డాడు.
ఇద్దరు మాజీ భార్యలు, కాబోయే భార్యతో ఒకే కారులో..
ఇటీవల అమీర్ ఖాన్ తన ఇద్దరు మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావుతో పాటు గౌరీ స్ప్రాట్‌తో కలిసి కనిపించాడు. ప్రస్తుతం గౌరీ స్ప్రాట్‌తో అమీర్ సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి వివాహంపై కూడా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో అమీర్, రీనా దత్తా, కిరణ్ రావు, గౌరీ స్ప్రాట్ ఒకే కారులో ప్రయాణిస్తూ కనిపించారు. అమీర్ ముందు సీటులో కూర్చోగా, వెనుక సీటులో మిగతా ముగ్గురు కూర్చున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
నెట్టింట వీడియో వైరల్
ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా విడాకుల తర్వాత మాజీ భార్యాభర్తలు దూరంగా ఉండటం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, అమీర్ మాత్రం తన మాజీ భార్యలతో ఇప్పటికీ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు అమీర్ చాలా మెచూర్డ్ అంటుండగా, మరికొందరు ఈ పరిస్థితి సాధారణంగా చాలా అరుదుగా కనిపిస్తుందని అంటున్నారు. మరికొందరు సరదాగా మీమ్స్ రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అమీర్ ఫ్యామిలీ గురించి..
అమీర్ ఖాన్ గతంలో రీనా దత్తా, కిరణ్ రావును వివాహం చేసుకుని తర్వాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విడిపోయిన తర్వాత కూడా వారితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ కారణంగానే ఆయన వ్యక్తిగత జీవితం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఒకే కారులో అమీర్, ఆయన ఇద్దరు మాజీ భార్యలు, గౌరీ స్ప్రాట్ కలిసి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.