Homeక్రైమ్నీట్ కోచింగ్ కి వెళ్లిన యువతి ఆత్మహత్య- హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణం

నీట్ కోచింగ్ కి వెళ్లిన యువతి ఆత్మహత్య- హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణం

కృష్ణా జిల్లా కానూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నీట్ పరీక్షకు శిక్షణ పొందుతున్న 19 ఏళ్ల యువతి వైష్ణవి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

హైదరాబాద్ బేగంపేటకు చెందిన వైష్ణవి, వైద్య విద్య లక్ష్యంగా కృష్ణా జిల్లాలోని ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇటీవల చేరింది. సుమారు మూడు వారాల క్రితమే హాస్టల్‌లో చేరిన ఆమె, కుటుంబ సభ్యుల నుండి దూరంగా ఉండలేకపోతున్నట్లు పలుమార్లు తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.

తనకు ఇంత దూరంలో ఉండి చదవడం కష్టంగా ఉందని చెప్పినా, భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు ఆమెను ఓదార్చి చదువుపై దృష్టి పెట్టమని సూచించారు. అయితే, మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోయిన వైష్ణవి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.

ఈ ఘటనపై హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా, వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ బిడ్డను చదువుకోసం పంపించగా ఇలా కోల్పోవాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి మృతికి గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది.

also read: ఏపీ హస్తకళలకు డిజిటల్ టచ్.. క్యూఆర్ కోడ్‌తో కొత్త దశ ప్రారంభం

తాజావార్తలు