Homeక్రైమ్నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో కూతురుని వేధిస్తున్నారని తండ్రి ఫిర్యాదు- హైదరాబాద్‌లో కేసు నమోదు

నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో కూతురుని వేధిస్తున్నారని తండ్రి ఫిర్యాదు- హైదరాబాద్‌లో కేసు నమోదు

హైదరాబాద్‌లో సైబర్ వేధింపుల కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. తన కుమార్తెను లక్ష్యంగా చేసుకుని నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా దూషణలు, పరువునష్టం కలిగించే పోస్టులు పెడుతున్నారని ఓ వృద్ధుడు చేసిన ఫిర్యాదుపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన కుమార్తెకు జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆమె అమెరికాలోని డెన్వర్, కొలరాడోలో ఇద్దరు చిన్నారులతో నివసిస్తోంది.

2025 మార్చిలో ఆమె భర్త అక్కడి కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయగా, ఆ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు వివాహ వివాదంలో జోక్యం చేసుకుని తన కుమార్తెను మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా, 2026 జనవరి నుంచి ‘రిష్.ఐరాక్26’ అనే పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి, తన కుమార్తెపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పరువునష్టం కలిగించే పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ఆమె స్నేహితులకు కూడా అదే విధంగా అసత్య సమాచారాన్ని పంపుతున్నారని తెలిపారు.

విడాకుల కేసులో ఒత్తిడి తీసుకురావడం, కుటుంబాన్ని మానసికంగా ఇబ్బందులకు గురిచేయడమే ఈ ప్రచారం వెనుక ఉద్దేశమని బాధితుడు ఆరోపించారు. సంబంధిత చాట్ రికార్డులు, స్క్రీన్‌షాట్లు, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా పోలీసులకు అందజేశారు.

ఈ ఫిర్యాదును స్వీకరించిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి, నకిలీ ఖాతాల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే దిశగా దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా ఖాతాల సాంకేతిక వివరాలు సేకరిస్తూ, పోస్టుల మూలాన్ని ట్రేస్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

also read: నీట్ కోచింగ్ కి వెళ్లిన యువతి ఆత్మహత్య- హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు