వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయించుకునేందుకు న్యాయపోరాటానికి దిగారు. ఈ మేరకు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో న్యాయస్థానాన్ని కోరారు.
వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ రోజున పులివెందుల మున్సిపల్ కార్యాలయం ఎదుట జగన్ నిరసనకు దిగారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను ఎన్నికల బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో ముందస్తు అనుమతి లేకుండా ఆందోళన చేపట్టారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంలో జగన్‌తో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, మరో 70 మందిపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. అయితే రాజకీయ కక్షతోనే తనపై కేసు పెట్టారని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసులో చట్టపరమైన ఆధారాలు లేవని, అందువల్ల కేసును రద్దు చేయాలని హైకోర్టును అభ్యర్థించారు.
ఇదిలా ఉండగా.. వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు కూడా తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట నిరసన తెలిపినందుకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహుల్లాపై విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీలు సైతం క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. జగన్ పిటిషన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు వేసిన పిటిషన్లను కూడా ఏపీ హైకోర్టు విచారించనుంది. ఈ కేసుల్లో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
also read: పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా విడాకుల వేళ… రేణూ దేశాయ్ పోస్ట్ నెట్టింట వైరల్!
