నగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి అధికారులు చర్యలను వేగవంతం చేశారు. తాగునీటిని అనవసర అవసరాలకు వినియోగిస్తున్న వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లో తాగునీటిని ఫ్లోర్ శుభ్రం చేసేందుకు ఉపయోగించిన అక్షయకల్ప ఫార్మ్స్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రూ.20 వేల జరిమానా విధించారు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న అక్షయకల్ప సంస్థ ప్రాంగణంలో జలమండలి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నేలను శుభ్రం చేసేందుకు తాగునీటిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో నిబంధనల ఉల్లంఘన కింద సంస్థకు రూ.20 వేల జరిమానా విధించారు. అంతేకాకుండా నిబంధనల ప్రకారం ఆ సంస్థ మురుగునీటి కనెక్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో తాగునీటి కొరత తలెత్తకుండా జలమండలి ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వాణిజ్య సంస్థలు, నివాస ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేసింది. తాగునీటిని కేవలం తాగేందుకు, వంట అవసరాలకే వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇళ్ల శుభ్రత, వాహనాల వాషింగ్, తోటల నిర్వహణ, నిర్మాణ పనుల వంటి అవసరాలకు మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి అందించే శుద్ధి చేసిన నీటిని (ట్రీటెడ్ వాటర్) ఉపయోగించాలని స్పష్టం చేస్తున్నారు.
నగరవ్యాప్తంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, తాగునీటిని దుర్వినియోగం చేసే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు హెచ్చరించారు. ఎక్కడైనా తాగునీరు వృథా అవుతున్నట్లు గుర్తిస్తే ప్రజలు ఆధారాలతో వాట్సాప్ నంబర్: 99499 30003కు ఫిర్యాదు చేయాలని కోరారు.
తాగునీటి వృథాకు సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలను ఈ నంబర్‌కు పంపించి అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని జలమండలి వెల్లడించింది.
also read: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన.. బాలీవుడ్ ప్రముఖులకు ముంబై పోలీసుల కీలక హెచ్చరిక!
