క్రైమ్ మిర్రర్ : మేడ్చల్‌లో భారీ దొంగతనం కలకలం రేపింది. జనసంచారం ఎక్కువగా ఉండే జాతీయ రహదారి పక్కన, పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న ఓ నగల దుకాణాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు బంగారు, వెండి ఆభరణాలతో పాటు భారీ మొత్తంలో నగదును అపహరించారు. భద్రతా పరంగా కీలకమైన ప్రాంతంలోనే ఈ చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలో శేషుమాల్ చౌదరి శ్రీ జగదాంబ జువెల్లర్స్ పేరుతో నగల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆదివారం దీపావళి పూజలు నిర్వహించిన అనంతరం ఆయన దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు. సోమవారం షాపు తెరవకపోవడంతో దుకాణం మూసే ఉంది. అయితే మంగళవారం ఉదయం వ్యాపారి షాపు తెరిచి లోపలికి వెళ్లగా అక్కడి పరిస్థితిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
దుకాణం లోపల ఉన్న చెక్క తలుపు ధ్వంసమై ఉండటంతో అనుమానం వచ్చిన ఆయన మరింత లోపలికి వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలో వెనుక వైపు గోడకు పెద్ద రంధ్రం కనిపించింది. దుండగులు వెనుక భాగం నుంచి గోడను పగులగొట్టి షాపులోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అనంతరం లోపల అడ్డుగా ఉన్న చెక్క తలుపును తొలగించి నగలు విక్రయించే గదిలోకి చేరుకున్నారు.
అక్కడ భద్రపరిచిన బంగారు, వెండి ఆభరణాలతో పాటు డ్రాలో ఉంచిన నగదును కూడా దోచుకెళ్లారు. ఈ చోరీలో సుమారు 25 తులాల బంగారం, 3.5 కిలోల వెండి, రూ.4 లక్షల నగదు అపహరణకు గురైనట్లు దుకాణ యజమాని శేషుమాల్ చౌదరి వెల్లడించారు. నగదు మినహాయిస్తే చోరీకి గురైన ఆభరణాల విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని తెలిపారు. దీంతో వ్యాపారికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.
చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుకాణంలోని పరిస్థితులను, దుండగులు ప్రవేశించిన మార్గాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. దొంగలను గుర్తించేందుకు అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి పక్కనే, పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఇంత భారీ చోరీ జరగడం మేడ్చల్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. దుండగులు ఎప్పుడు వచ్చారు? ఎంతసేపు షాపులో ఉన్నారు? ఈ చోరీలో ఇంకా ఎవరైనా పాల్గొన్నారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
also read : నల్లగొండలో దారుణం.. పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు హత్య
