బాలీవుడ్ నటి రాధికా ఆప్టే మరోసారి దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో దక్షిణాది సినిమాల్లో నటించే సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కొన్ని చిత్రాలు మంచి అనుభూతిని అందించినప్పటికీ, మరికొన్ని సినిమాల షూటింగ్‌లు తనకు మానసికంగా అసౌకర్యాన్ని కలిగించాయని చెప్పుకొచ్చింది.
నటి కీర్తి సురేశ్‌తో కలిసి నటించిన తన తాజా చిత్రం ‘అక్క’ ప్రమోషన్లలో భాగంగా ఐఏఎన్ఎస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక ఈ విషయాలను పంచుకుంది. దక్షిణాది చిత్రాల షూటింగ్‌లకు వెళ్లినప్పుడు తనకు పరిచయస్తులు ఎవరూ ఉండేవారు కాదని, ఏజెంట్ లేదా స్నేహితుల సహాయం కూడా లేకుండానే కొత్త ప్రాంతాల్లో గడపాల్సి వచ్చేదని తెలిపింది.
ముఖ్యంగా షూటింగ్ సెట్స్‌లో ఎక్కువ మంది పురుషులే ఉండేవారని, వారు మాట్లాడే భాష తనకు అర్థం కాకపోవడంతో వారితో కలవడం కష్టమయ్యేదని వివరించింది. కొన్ని సందర్భాల్లో ముందుగానే ఒప్పందాలు చేసుకునే పరిస్థితి ఉండేది కాదని, స్క్రిప్ట్ కూడా తనకు ముందుగా అందించేవారు కాదని పేర్కొంది. దీంతో తనకు ఏం అడగాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది.
మరాఠీ చిత్రాల్లో పనిచేసేటప్పుడు భాష తెలిసి ఉండటంతో పాటు, అవసరమైతే ఇంటికి వెళ్లే అవకాశం కూడా ఉండేదని రాధిక గుర్తుచేసుకుంది. అయితే దక్షిణాది సినిమాల షూటింగ్‌ల సమయంలో మాత్రం తనకు అలాంటి వెసులుబాటు లేకపోవడంతో ఒంటరితనాన్ని అనుభవించానని వెల్లడించింది.
ఈ తరహా చేదు అనుభవాలు కేవలం దక్షిణాది చిత్రాలకే పరిమితం కాలేదని, బాలీవుడ్‌లోనూ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నానని స్పష్టం చేసింది. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, తనకు నచ్చని విషయాలను స్పష్టంగా చెప్పడం, అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం నేర్చుకున్నానని పేర్కొంది.
ఇటీవలే దక్షిణాది చిత్రంలో ఓ వయసు పైబడిన హీరోతో రొమాన్స్ చేయాల్సి వచ్చిందంటూ రాధిక చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. తాజాగా మరోసారి షూటింగ్ సెట్స్‌లో ఎదురైన పరిస్థితుల గురించి మాట్లాడటంతో ఆమె వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
రాధిక ఆప్టే ‘రక్త చరిత్ర’, ‘ధోని’, ‘ఎందుకంటే ప్రేమంట!’, ‘లెజెండ్’, ‘లయన్’, ‘హరమ్’ వంటి పలు దక్షిణాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.
also read: ఘోర రోడ్డు ప్రమాదం…! చిన్నారితో సహా ఆరుగురు సజీవ దహనం…
