Homeక్రైమ్మీర్‌పేట్ జంట హత్యల కేసులో కీలక పరిణామం.. 24 గంటల్లో నిందితుడి అరెస్ట్!

మీర్‌పేట్ జంట హత్యల కేసులో కీలక పరిణామం.. 24 గంటల్లో నిందితుడి అరెస్ట్!

క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్ శివారులోని మీర్‌పేట్‌లో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు మహిళలను హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిని 24 గంటల్లోనే అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన విభేదాలు, గతంలో జరిగిన అవమానాలే ఈ దారుణానికి కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ

శుక్రవారం శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రాజేష్, ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి, మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ బి. శోభన్‌తో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడిని మహమ్మద్ సిద్ధిఖీ (42)గా గుర్తించారు. నల్గొండ జిల్లా మర్రిగూడకు చెందిన ఇతడు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హయత్ కాలనీ, షరీఫ్ నగర్, బండ్లగూడ ప్రాంతంలో నివసిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బడంగ్‌పేట్ పరిధిలోని సాయి విహార్ నగర్‌కు చెందిన కుటుంబంలో వివాహ సంబంధం ద్వారా ఇతడికి బంధుత్వం ఏర్పడింది.

పెద్దల సమక్షంలో అవమానించారనే కక్షతో..

నిందితుడికి అతడి భార్య తరఫు కుటుంబ సభ్యులతో కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కుటుంబ పెద్దల సమక్షంలో తనను అవమానించారని, తనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని సిద్ధిఖీ భావించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై కక్ష పెంచుకున్న అతడు కుటుంబ సభ్యులను అంతమొందించాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 4వ తేదీ సాయంత్రం తన బావమరిది యూసుఫ్ పనిచేస్తున్న మీర్‌పేట్‌లోని పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి అతడిని తన కారులో ఎక్కించుకుని సాయి విహార్ నగర్‌లోని ఇంటికి తీసుకెళ్లాడు.

మాటామాటా పెరిగి కత్తితో దాడి.. ఇద్దరి మృతి

ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సమయంలో వివాదం మరోసారి తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. అప్పటికే కత్తితో అక్కడికి చేరుకున్న సిద్ధిఖీ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అత్త నిరంజన్ బీ, బావమరిది భార్య రేష్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన యూసుఫ్ కూడా కత్తిపోట్లకు గురయ్యాడు. తీవ్ర గాయాలైన అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం నిందితుడు తన కారులో అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.

టాస్క్‌ఫోర్స్‌తో కలిసి పోలీసుల గాలింపు.. నిందితుడి అరెస్ట్

ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు మీర్‌పేట్ పోలీసులు, శంషాబాద్ టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం సిద్ధిఖీని అదుపులోకి తీసుకుని విచారించగా, హత్యలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు డీసీపీ తెలిపారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

హత్యకు ఉపయోగించిన వస్తువులు స్వాధీనం

నిందితుడి నుంచి నేరానికి ఉపయోగించిన కత్తితో పాటు వ్యాగనార్ కారు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, మృతురాలు రేష్మపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయని, ఆ కోణంలోనూ విచారణ కొనసాగుతోందని డీసీపీ స్పష్టం చేశారు.

పోలీసు బృందాలకు ఉన్నతాధికారుల అభినందనలు

ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ బి. శోభన్, శంషాబాద్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్, మీర్‌పేట్ ఎస్‌ఐ మహమ్మద్ అబ్దుల్ హయ్యూమ్‌తో పాటు ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బంది కీలకంగా వ్యవహరించారు. తక్కువ సమయంలోనే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసు బృందాల పనితీరును పోలీస్ కమిషనర్ అభినందించారు. సిబ్బందికి తగిన ప్రోత్సాహకాలు, రివార్డులు అందజేస్తామని ఉన్నతాధికారులు ప్రకటించారు. కుటుంబ వివాదం చివరకు రెండు ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన మీర్‌పేట్ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
also read : సంగారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర దారి దోపిడీ ముఠా అరెస్ట్.. డమ్మీ తుపాకీ, కత్తులతో బెదిరింపులు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు