క్రైమ్ మిర్రర్ : సంగారెడ్డి జిల్లాలో హైవేపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకు పోలీసులు తెరదించారు. జాతీయ రహదారిపై రాత్రి వేళల్లో ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితులు డమ్మీ తుపాకీ, కత్తులను చూపించి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసి నగలు, నగదును దోచుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
NH-65పై వాహనదారులే టార్గెట్..
సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ముఠా జాతీయ రహదారి 65పై రాత్రి సమయాల్లో ఆగి ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతోంది. ముఖ్యంగా వాహనాలను నిలిపి విశ్రాంతి తీసుకుంటున్న వారిని గుర్తించి, వారిని బెదిరించి విలువైన వస్తువులను అపహరిస్తోంది. పూణే ప్రాంతంలో చోరీకి గురైన ఓ బైక్ను ఉపయోగిస్తూ ఈ ముఠా తమ కార్యకలాపాలు సాగించినట్లు పోలీసులు గుర్తించారు.
పది రోజుల్లో నాలుగు చోట్ల దోపిడీలు..
అక్టోబర్ 17 నుంచి 26వ తేదీ మధ్య హైవేపై నాలుగు ప్రాంతాల్లో ఈ ముఠా దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, కోహిర్, చిరాగ్పల్లి ప్రాంతాల్లో నిలిపి ఉంచిన వాహనాల్లోని వ్యక్తులను టార్గెట్ చేశారు. డమ్మీ తుపాకీ, కత్తులతో బెదిరించి బాధితుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యేవారు. అంతేకాకుండా కర్ణాటక రాష్ట్రంలోని హుమ్నాబాద్ సమీపంలో కూడా ఇదే తరహాలో దారి దోపిడీకి పాల్పడినట్లు వెల్లడైంది.
వాహనాల తనిఖీల్లో చిక్కిన నిందితులు..
దోపిడీలకు పాల్పడుతున్న ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మడ్గి చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానితులు పట్టుబడ్డారు. వారిని విచారించగా దారి దోపిడీలకు సంబంధించిన వివరాలు బయటపడినట్లు సమాచారం. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ముఠా కార్యకలాపాల వెనుక కీలకంగా వ్యవహరించిన ప్రధాన సూత్రధారి ఇంకా పరారీలో ఉన్నట్లు ఎస్పీ పరితోశ్ పంకజ్ వెల్లడించారు.
పరారీలో ప్రధాన నిందితుడు.. కొనసాగుతున్న గాలింపు
అంతర్రాష్ట్ర స్థాయిలో దోపిడీలకు పాల్పడిన ఈ ముఠాకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. హైవేలపై రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సంగారెడ్డి పోలీసులు చేపట్టిన చర్యలతో హైవేపై దోపిడీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు పట్టుబడటంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
also read : కనిపించకుండా పోయిన పెంపుడు చిలుక.. ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి!
