తెలంగాణలో కల్తీ పాల తయారీ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో అక్రమంగా నిర్వహిస్తున్న కల్తీ పాల తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అక్రమాలను గుర్తించి భారీగా కల్తీ పాల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల తనిఖీల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్, పాలపొడిని ఉపయోగించి కృత్రిమంగా పాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సహజమైన పాలకు బదులుగా రసాయన పదార్థాలు, పాలపొడితో కలిపి పాలను తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ దాడుల్లో సుమారు 100 లీటర్ల కల్తీ పాలు, 35 పాలపొడి ప్యాకెట్లను ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేంద్రం నిర్వహణ వెనుక ఎవరున్నారు? ఎంతకాలంగా ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతోంది? తయారు చేసిన పాలను ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
also read: కరీంనగర్ KFCలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. 90 కేజీల నూనె స్వాధీనం!
