Homeతెలంగాణవిచారణలో అక్రమాలు నిర్ధారణ.. అయినా చర్యలేవీ?

విచారణలో అక్రమాలు నిర్ధారణ.. అయినా చర్యలేవీ?

  • ఖుదాబక్ష్‌పల్లిలో పంచాయతీ కార్యదర్శి వ్యవహారంపై అధికారుల ఉదాసీనత!

  • ఫిర్యాదులు నాలుగు.. విచారణ నివేదిక ఒకటి.. షోకాజ్‌ నోటీసుతోనే సరి!

  • నెలలు గడుస్తున్నా తేలని వ్యవహారం.. పక్షపాతమా? అధికారుల అండదండలా?

మర్రిగూడ 01 నవంబర్ 2026 : గ్రామ పంచాయతీల్లో ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన అధికారులే, నిబంధనలను పక్కనపెడితే ఇక సామాన్యులకు న్యాయం చేసేదెవరు? నిబంధనలకు విరుద్ధంగా ఇంటి పన్నుల అంచనాలు, ధృవీకరణ పత్రాలు జారీ చేయడం, ఇతరుల ఇంటి నెంబర్లపై రశీదులు ఇవ్వడం, ఇంటి పన్ను సొమ్మును వ్యక్తిగత ఫోన్‌పే ఖాతాకు తీసుకోవడం వంటి, తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖుదాబక్ష్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీపతి ప్రసన్నబాబు వ్యవహారం, అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ వ్యవహారంపై గ్రామానికి చెందిన మాతంగి నవీన్, నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అనంతరం మండల స్థాయిలో విచారణ జరిగింది. విచారణాధికారి నివేదిక కూడా సమర్పించారు. జిల్లా పంచాయతీ అధికారి సైతం వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. అయినప్పటికీ ఫిర్యాదుదారుడి ఆరోపణ ప్రకారం, ఇప్పటివరకు తగిన తుది చర్యలు కనిపించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..! విచారణ నివేదికలో అక్రమాలుగా పేర్కొన్న అంశాలపై, చర్యలు తీసుకోవడంలో అధికారులకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు? బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థే ఎందుకు మౌనం వహిస్తోంది? అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

  • ఫిర్యాదుల పరంపర.. అధికారుల దృష్టికి వెళ్లినా ఫలితమేది?

మర్రిగూడ మండలం ఖుదాబక్ష్‌పల్లి గ్రామానికి చెందిన మాతంగి నవీన్, గ్రామ పంచాయతీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న శ్రీపతి ప్రసన్నబాబు పిరియడ్ లో, పరిపాలనలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ, 17 ఆగస్టు 2026 న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఇంటి పన్నుల అంచనాలు, ఇంటి నెంబర్లు, ధృవీకరణ పత్రాలు, పన్నుల వసూళ్లకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం 07 సెప్టెంబర్ 2026న మరోసారి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆగస్టు 17న ఇచ్చిన ఫిర్యాదుపై విచారణాధికారిని నియమించినప్పటికీ, విచారణలో తాను సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయలేదని ఆరోపించారు. ఆగస్టు 24న సంబంధిత ఆధారాలను సమర్పించినట్లు పేర్కొంటూ, పంచాయతీ కార్యదర్శిపై సమగ్ర విచారణ జరిపించాలని నవీన్ కోరారు. ఇదే అంశంపై 05 అక్టోబర్ 2026న మరోసారి ఫిర్యాదు చేశారు. ఆగస్టు 17, సెప్టెంబర్ 7 తేదీల్లో ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిగినప్పటికీ, తనకు న్యాయం జరగలేదని, కార్యదర్శిపై తగిన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 26 అక్టోబర్ 2026న మరో వినతిపత్రం సమర్పించారు. అక్టోబర్ 5, అక్టోబర్ 17, సెప్టెంబర్ 7 తేదీల్లో చేసిన ఫిర్యాదులను ప్రస్తావిస్తూ, విచారణ నివేదికలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అంశాలు ఉన్నప్పటికీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

  • విచారణ నివేదికలో ఏముంది?

మాతంగి నవీన్ ఫిర్యాదుపై మర్రిగూడ మండల పంచాయతీ అధికారి విచారణ చేపట్టారు. 25 ఆగష్టు 2026 తేదీతో సమర్పించిన విచారణ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించారు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి 17 ఆగష్టు 2026న జారీ చేసిన మెమో నెంబర్, 3737/2026-బి3(పిటీఎస్)కు సంబంధించి ఈ విచారణ చేపట్టినట్లు నివేదికలో పేర్కొన్నారు. విచారణలో భాగంగా ఇంటి నెంబర్లు, రిజిస్టర్ రికార్డులు, అసెస్‌మెంట్ వివరాలు, పన్నుల వసూళ్లకు సంబంధించిన అంశాలను పరిశీలించినట్లు వెల్లడించారు. నివేదికలో ప్రధానంగా ఇంటి పన్నుల అంచనాలకు సంబంధించిన ధృవీకరించిన ప్రతులను ఉన్నతాధికారుల మార్గదర్శకాలకు విరుద్ధంగా జారీ చేసినట్లు, సంబంధిత వ్యక్తులకు చెందని ఇంటి నెంబర్లపై కొందరు గ్రామస్థులకు ఇంటి పన్ను రశీదులు, ధృవీకరణ పత్రాలు ఇచ్చినట్లు ప్రస్తావించారు. ఈ అంశాలు సాధారణ పరిపాలనా పొరపాట్లుగా కొట్టిపారేయదగినవి కావు. గ్రామ పంచాయతీ రికార్డుల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసే అంశాలుగా నివేదికలో చోటుచేసుకున్నాయి.

  • ఇంటి నెంబర్లపై ద్వంద్వ ధృవీకరణలు.. రికార్డుల్లో ఏముంది?

విచారణ నివేదికలో 1-392, 1-56 ఇంటి నెంబర్లకు సంబంధించి, ప్రత్యేకంగా వివరాలు పొందుపరిచారు. 09 జనవరి 2026న మాదగోని శివ పేరుతో ఇంటి నంబర్ 1-392కు సంబంధించి స్వంత నివాస ధృవీకరణ పత్రం జారీ చేసినట్లు, ఆ ఇంటి విలువ సుమారు 1,26,480గా పేర్కొన్నారు.. అదే ఇంటి నెంబరుకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్ వివరాలు, అసెస్‌మెంట్ అంశాల్లో వ్యత్యాసాలున్నట్లు విచారణలో తేలింది. ఈ ఇంటి నెంబరుపై జారీ చేసిన పత్రాల చెల్లుబాటు, వాటి ఆధారాలు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అదేవిధంగా 1-56 ఇంటి నెంబరుకు సంబంధించి కూడా 09 జనవరి 2026న స్వంత నివాస ధృవీకరణ పత్రం జారీ చేసినట్లు, దాని విలువ 2,45,160గా నమోదు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఇంటి నెంబరుకు సంబంధించిన రిజిస్టర్, అసెస్‌మెంట్ రికార్డులను పరిశీలించినప్పుడు వ్యత్యాసాలు ఉన్నట్లు విచారణ నివేదికలో ప్రస్తావించారు. అయినప్పటికి ఇలాంటి సెక్రటరీలపై ఉన్నత అధికారుల ప్రేమ వెనుక, ఉన్న మతలబు ప్రజలకు అర్ధం కాని పరిస్థితి..

  • ఫోన్‌పే ద్వారా వ్యక్తిగత ఖాతాకు ఇంటి పన్ను సొమ్ము!

ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం ఇంటి పన్ను వసూళ్లకు సంబంధించినది. 09 జనవరి 2026న మాదగోని స్వామి నుంచి ఇంటి పన్ను పేరుతో మూడు వేల రూపాయలను, కార్యదర్శి తన వ్యక్తిగత ఫోన్‌పే ఖాతాకు స్వీకరించినట్లు విచారణ నివేదికలో పేర్కొన్నారు. అనంతరం ఆరోపణలు రావడంతో అందులో 1469ను మాదగోని స్వామి, ఆయన బంధువు మాదగోని అనిల్‌కు సంబంధించిన ఇంటి పన్నుగా పరిగణించి, మిగిలిన 1531ను మాదగోని స్వామికి తిరిగి చెల్లించినట్లు నివేదికలో వివరించారు. ప్రభుత్వ పంచాయతీ ఆదాయాన్ని వ్యక్తిగత ఖాతాలోకి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అధికారిక రసీదు జారీ చేయకుండా, వ్యక్తిగత ఫోన్‌పే ద్వారా నగదు స్వీకరించడానికి అనుమతి ఎవరిచ్చారు? వసూలైన మొత్తం, పంచాయతీ ఖాతాలో జమ అయిన మొత్తం మధ్య తేడా ఎందుకు వచ్చింది? 1531 తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఈ ప్రశ్నలకు సంబంధిత అధికారి నుంచి స్పష్టమైన సమాధానం రావాల్సి ఉంది.

  • షోకాజ్‌ నోటీసు జారీ.. ఆ తర్వాత ఏమైంది?

విచారణ నివేదిక ఆధారంగా నల్గొండ జిల్లా పంచాయతీ అధికారి 14-10-2026న సర్క్యులర్ నంబర్ 3737/2026-బి3(పిటీఎస్) ద్వారా శ్రీపతి ప్రసన్నబాబుకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. నోటీసులో మూడు ప్రధాన అభియోగాలను ప్రస్తావించారు. ఉన్నతాధికారుల మార్గదర్శకాలకు విరుద్ధంగా అసెస్‌మెంట్‌ల ధృవీకరించిన ప్రతులు జారీ చేయడం, సంబంధం లేని ఇంటి నెంబర్లపై ఇంటి పన్ను రశీదులు, ధృవీకరణ పత్రాలు ఇవ్వడం, 09 జనవరి 2026న మూడు వేల రూపాయలను వ్యక్తిగత ఫోన్‌పే ఖాతాకు స్వీకరించి, తరువాత 1469 రూపాయలను పన్నుగా పరిగణించి 1531 తిరిగి చెల్లించడం వంటి అంశాలను నోటీసులో పేర్కొన్నారు. ఈ లోపాలపై తెలంగాణ సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్) నిబంధనలు 1991 ప్రకారం, తదుపరి క్రమశిక్షణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో, మూడు రోజుల్లో వివరణ సమర్పించాలని జిల్లా పంచాయతీ అధికారి ఆదేశించారు. వివరణ ఇవ్వని పక్షంలో కార్యాలయంలో అందుబాటులో ఉన్న రికార్డులు, అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. విచారణ నివేదిక ప్రతిని కూడా నోటీసుతో జతచేశారు. అంటే ఫిర్యాదుదారుడు చేసిన ఆరోపణలు అధికారిక విచారణ వరకు వెళ్లడమే కాకుండా, విచారణ నివేదికలో పేర్కొన్న అంశాల ఆధారంగా జిల్లా స్థాయిలో షోకాజ్‌ నోటీసు కూడా జారీ అయింది. అయినప్పటికీ ఆ నోటీసు అనంతరం ఏం జరిగింది? కార్యదర్శి వివరణ ఇచ్చారా? ఇచ్చిన వివరణపై అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నారు? తదుపరి క్రమశిక్షణ చర్యలు ప్రారంభించారా? లేక షోకాజ్‌ నోటీసుతోనే వ్యవహారాన్ని ముగించారా? అన్నది ఇప్పటికీ స్పష్టత రావాల్సిన అంశం.

  • ఫిర్యాదుదారుడి ఆరోపణ.. అధికారుల తీరుపై అనుమానాలు!

తాను పలుమార్లు ఫిర్యాదు చేసినా, విచారణకు ఆధారాలు సమర్పించినా, నివేదికలో అక్రమాలు ప్రస్తావించినా, తనకు న్యాయం జరగలేదని మాతంగి నవీన్ ఆరోపిస్తున్నారు. సంబంధిత కార్యదర్శిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విచారణ జరిపినప్పుడు బాధ్యతగా వ్యవహరించిన అధికారులు, తదుపరి చర్యల విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిధులు, గ్రామ పంచాయతీ ఆదాయం, ఇంటి పన్నుల వసూళ్లు, ఆస్తుల ధృవీకరణ వంటి అంశాల్లో అక్రమాలు జరిగినట్లు విచారణ నివేదికలో ప్రస్తావన వచ్చినప్పుడు, వాటిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదే. కేవలం వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడం వరకే పరిమితమైతే, గ్రామస్థులకు న్యాయం ఎలా జరుగుతుందన్నారు? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారిపై ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరిపి, నివేదిక తెప్పించి, ఆ తర్వాత చర్యల విషయంలో మౌనం వహించడం వెనుక కారణమేంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యదర్శుల వ్యవహారాలపై జిల్లా స్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉందా?పంచాయతీల ఆదాయ వసూళ్లు, ఇంటి పన్నుల రికార్డులు, ధృవీకరణ పత్రాల జారీపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారా? తప్పులు బయటపడిన తర్వాత కూడా చర్యలు ఆలస్యమైతే, నిబంధనలు ఉల్లంఘించే వారికి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? బాధితులు ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరగాలి? ఫిర్యాదులు, విచారణలు, నివేదికలు ఉన్నా ఫలితం లేకపోతే ప్రజలు అధికార యంత్రాంగాన్ని ఎలా నమ్మాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు..ఖుదాబక్ష్‌పల్లి వ్యవహారం ఒక్క కార్యదర్శి ఆరోపణలకే పరిమితం కాకుండా, గ్రామ పంచాయతీల్లో పరిపాలనా పారదర్శకత, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరుపై విస్తృత ప్రశ్నలను ముందుకు తెస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యదర్శి వివరణ, జిల్లా పంచాయతీ అధికారి తుది నిర్ణయం, తదుపరి చర్యల వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఫిర్యాదుదారుడికి న్యాయం చేయడంతోపాటు, గ్రామ పంచాయతీ రికార్డులపై సమగ్ర ఆడిట్ నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. చూదాం ఉన్నత అధికారుల వివరణ, చర్యలు ఏ విధంగా ఉండనున్నాయో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు