Homeసినిమా‘రామాయణ’ సంగీతంపై పాత లక్ష్మణుడి అసంతృప్తి..

‘రామాయణ’ సంగీతంపై పాత లక్ష్మణుడి అసంతృప్తి..

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రామాయణ’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే కొన్ని అంశాలపై చర్చ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రంపై రామానంద్ సాగర్ తెరకెక్కించిన పాత ‘రామాయణ్’ సీరియల్‌లో లక్ష్మణుడిగా నటించి గుర్తింపు పొందిన సునీల్ లహ్రీ తన అభిప్రాయాలను వెల్లడించారు.

తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసిన వీడియోలో సునీల్ లహ్రీ మాట్లాడుతూ.. కొత్తగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రాన్ని తాను ఇంకా చూడలేదని స్పష్టం చేశారు. ఈ ఇతిహాసం భారతీయ సంస్కృతికి మాత్రమే పరిమితమైనది కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు గొప్ప సందేశాన్ని అందించే మహాకావ్యమని అభిప్రాయపడ్డారు. గతంలో తాను కూడా రామాయణ కథలో భాగమైనందున ఈ సినిమాపై తన అభిప్రాయం తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

అయితే చిత్రంలోని సంగీతంపై మాత్రం ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ వంటి ప్రముఖ సంగీత దర్శకులు పనిచేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు తాను విన్న కొన్ని పాటలు, సంగీత ధ్వనులు అంతగా ఆకట్టుకోలేదని చెప్పారు. రామాయణ కథలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, అయోధ్య, మిథిల వంటి ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం సంగీతంలో కనిపించాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒక సాధారణ ప్రేక్షకుడిగా మాత్రమే ఈ విషయాన్ని చెబుతున్నానని స్పష్టం చేశారు.

మరోవైపు దర్శకుడు నితేశ్ తివారీపై సునీల్ లహ్రీ ప్రశంసలు కురిపించారు. గతంలో ఆయన రూపొందించిన సినిమాలు తనకు నమ్మకాన్ని కలిగించాయని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమించి మంచి సినిమాను ప్రేక్షకులకు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమా విజయవంతం కావడం ఎంతో ముఖ్యమని సునీల్ లహ్రీ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టుతో ఎంతోమంది జీవితాలు ముడిపడి ఉన్నాయని పేర్కొంటూ, సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. చివరగా జై శ్రీరామ్ అంటూ తన సందేశాన్ని ముగించారు.

మొత్తానికి ‘రామాయణ’ సినిమా విషయంలో సునీల్ లహ్రీ పూర్తి మద్దతు ప్రకటించినప్పటికీ, సంగీతం విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

also read:  ‘కింగ్ 100’లో మహంతి ఝాన్సీ రాణిగా టబు.. పవర్‌ఫుల్ ఫస్ట్‌లుక్‌తో పెరిగిన అంచనాలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు