Homeతెలంగాణతెలంగాణ ఉద్యమకారుడి విషాదాంతం.. అప్పుల బాధతో పీఏసీఎస్ డైరెక్టర్ ఆత్మహత్య!

తెలంగాణ ఉద్యమకారుడి విషాదాంతం.. అప్పుల బాధతో పీఏసీఎస్ డైరెక్టర్ ఆత్మహత్య!

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఓ ఉద్యమకారుడి జీవితం విషాదంగా ముగిసింది. ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయంలో వరుస నష్టాలు, అప్పుల ఒత్తిడితో జనగామ జిల్లాకు చెందిన వేముల లక్ష్మణ్ గౌడ్ (40) ఆత్మహత్య చేసుకున్నారు. బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన ఆయన సోమవారం ఓ వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరివేసుకుని కనిపించారు. స్థానికంగా పీఏసీఎస్ డైరెక్టర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణ్ గౌడ్ కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన అప్పులతో పాటు, వ్యవసాయంలో ఎదురైన పంట నష్టాలు ఆయనపై మరింత భారాన్ని పెంచాయి. ఆయనకు నాలుగు ఎకరాల సొంత వ్యవసాయ భూమి ఉండగా, అదనంగా మరో ఆరు ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. అయితే పంటలు ఆశించిన స్థాయిలో దిగుబడి ఇవ్వకపోవడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.

మరోవైపు అప్పులు తిరిగి చెల్లించాలంటూ బంధువులు, ప్రైవేట్ ఫైనాన్షియర్ల నుంచి ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులే తన భర్తను తీవ్ర ఆవేదనకు గురిచేశాయని భార్య స్వప్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సెల్‌ఫోన్‌లో చివరి సందేశం..

ఆత్మహత్యకు ముందు లక్ష్మణ్ గౌడ్ తన మొబైల్ ఫోన్‌లో రాసుకున్న నోట్ కుటుంబ సభ్యులను కలచివేసింది. తండ్రి ఎంతో కష్టపడి చదివించినప్పటికీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వల్ల తన జీవితం దెబ్బతిన్నదని అందులో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారుల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని పేర్కొన్నారు. తన భార్య, ఇద్దరు పిల్లలను ఉద్దేశించి క్షమాపణలు కూడా రాశారు.

విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో కీలక పాత్ర

లక్ష్మణ్ గౌడ్ విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పటి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) యువజన విభాగంలో పనిచేశారు. అనంతరం జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో భాగస్వామిగా ఉన్న ఆయన, పీఏసీఎస్ డైరెక్టర్‌గా కొనసాగారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల మధ్య ఇలా ప్రాణాలు కోల్పోవడంతో కొన్నె గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

also read: రుద్ర మహేశ్ కస్టడీ వివాదానికి తెర.. పెంచుకున్న తల్లిదండ్రుల చెంతకు బాలుడు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు