క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :-ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగింపునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో స్థానిక పోరుకు మార్గం సుగమమైంది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం, ఓటర్ల జాబితా వినియోగంపై ఉన్న సందేహాలకు స్పష్టతనిచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సమయానికి తుది ఓటర్ల జాబితా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, ఆ కొత్త జాబితా ఆధారంగానే ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని స్పష్టం చేసింది. అయితే, ఒకవేళ నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) జాబితా సిద్ధం కాకపోతే, పాత ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలను కొనసాగించవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు. నిబంధనల ప్రకారం నవంబర్ 12వ తేదీలోగా ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుతో ఎన్నికల నిర్వహణపై ఉన్న అనిశ్చితి తొలగిపోయింది. దీనితో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కగా, ఎన్నికల కమిషన్ తదుపరి చర్యలపై దృష్టి సారించింది.
