-
కాకినాడ, మచిలీపట్నం, ఏలూరు, విజయనగరం ఇచ్చే అవకాశం
-
జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మునిసిపాలిటీలు ఆ పార్టీకే
-
విశాఖ కోసం పట్టుపడుతున్న బిజెపి
-
తిరుపతి ఇస్తామంటున్న టిడిపి
-
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూటమి కసరత్తు ప్రారంభం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా సిద్ధమవుతున్నాయి. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం వెలువడిన వెంటనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది.
అయితే ఇప్పటికే అధికార కూటమితో పాటు విపక్ష వైసిపి గట్టి ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో గట్టి అభ్యర్థులను రంగంలోకి దించాలని చూస్తున్నాయి.
కూటమిలో మూడు పార్టీల మధ్య పదవుల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. జనసేన కోరుకుంటున్న మేయర్ సీట్లపై స్పష్టత వస్తోంది. తమకు కేటాయించాల్సిన పదవుల కు సంబంధించిన జాబితాను పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అందించినట్లు సమాచారం.
-
ఈ నెల చివరిలోగా..
ఈనెల చివరిలోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తిచేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఈనెల 12న ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే దాదాపు ఒక కొలిక్కి వచ్చిందని.. విశాఖ, విజయవాడ, తిరుపతి మేయర్ పదవుల పైనే ఆ మూడు పార్టీల మధ్య ఒక నిర్ణయం జరగాల్సి ఉంది. అయితే ఈ మూడు నగరాలను ఆ పార్టీలు కోరుకుంటున్నాయి. విశాఖ విషయంలో బిజెపి పట్టుబడుతోంది. అయితే తిరుపతి ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు సమాచారం.
మరోవైపు విజయవాడ, ఏలూరు, ఒంగోలు, కాకినాడ, మచిలీపట్నం స్థానాలను జనసేన కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే కాకినాడ, మచిలీపట్నం, ఏలూరు, విజయనగరం స్థానాలు ఇచ్చేందుకు టిడిపి అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. ఒంగోలు, నెల్లూరు విషయంలోనే ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది.
-
ఎస్టీ నియోజకవర్గాల్లో సైతం..
మున్సిపాలిటీలకు సంబంధించి జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట తమ పార్టీకి విడిచి పెట్టాలని పవన్ కోరుతున్నారు. ఎస్టీ నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలపై కూడా ఆయన దృష్టి పెట్టారు. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో తమకు సీట్లు తగ్గిస్తే.. జిల్లా పరిషత్తులలో ప్రాతినిధ్యం పెంచాలని బిజెపి కోరుతున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటికే వైసీపీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతోంది. నెల్లూరు నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరును ప్రకటించారు. వైసిపి దూకుడు మీద ఉండడంతో మూడు పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. మరోవైపు జనసేనతో పాటు బిజెపికి బలం ఉన్నచోట మాత్రమే పోటీలో ఉండేలా టిడిపి చూస్తోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
