క్రైమ్ మిర్రర్ : ములుగు జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇసుక లారీ అదుపుతప్పి సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న డీసీఎం వ్యాన్‌తో పాటు మరో కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. గోవిందరావుపేట మండలం పస్రా ఫారెస్ట్ చెక్‌పోస్ట్‌కు సుమారు అర కిలోమీటర్ దూరంలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. రహదారిపై వెళ్తున్న ఇసుక లారీ ఒక్కసారిగా అదుపుతప్పి ఎదురుగా వస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల డీసీఎం వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో మరో కారును కూడా లారీ ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
లారీ ఢీకొట్టిన ధాటికి వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని 108 అంబులెన్స్ సిబ్బంది సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఉన్నత ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం.
ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రమాదానికి ఇసుక లారీ అదుపుతప్పడమే కారణమా.. లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతుడు మరియు క్షతగాత్రుల వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
also read: యూట్యూబర్ మధుమిత చుట్టూ ఉచ్చు.. పోలీసుల దర్యాప్తు
