– ఢిల్లీలో చంద్రబాబు ఫోకస్.. రాయలసీమ నుంచి విశాఖ మెట్రో వరకు కీలక చర్చలు
– నిర్మలా సీతారామన్‌తో రాష్ట్ర ప్రాజెక్టులపై చంద్రబాబు భేటీ
– రాయలసీమ హార్టికల్చర్ హబ్ తదుపరి కార్యాచరణపై చర్చ
– విశాఖ మెట్రో, బీచ్ కారిడార్‌కు కేంద్ర అనుమతులపై ప్రయత్నం
– కరవు, గోదావరి పుష్కరాలకు కేంద్ర సాయం కోరనున్న సీఎం
క్రైమ్ మిర్రర్,రాజకీయం:-
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీలో వరుస సమావేశాలకు శ్రీకారం చుట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయి.. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాయలసీమలో ప్రారంభమైన భారీ హార్టికల్చర్ ప్రాజెక్టును తదుపరి దశకు తీసుకెళ్లే కార్యాచరణపై కేంద్ర మంత్రితో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు ఇటీవల మదనపల్లెలో శంకుస్థాపన జరిగింది.
జిల్లాల వారీగా కార్యాచరణ
రాయలసీమను అంతర్జాతీయ స్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌పై జిల్లాల వారీగా చేపట్టాల్సిన పనులను చంద్రబాబు వివరించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరై ప్రత్యేక శ్రద్ధ చూపిన నిర్మలా సీతారామన్‌కు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ హబ్ పది జిల్లాలను కవర్ చేస్తూ మూడు దశల్లో అమలు చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడైంది.
కేంద్రంతో మరిన్ని అంశాలపై చర్చ
కేంద్ర-రాష్ట్ర వాటాలకు సంబంధించిన ఎయిడెడ్ ప్రాజెక్టుల అంశం కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా విజయవాడ ఉత్సవ్‌కు రావాలని చంద్రబాబు నిర్మలా సీతారామన్‌ను ఆహ్వానించారు. ఇదే పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు, నిధులపై కేంద్రం నుంచి సహకారం కోరనున్నారు.
మెట్రో నుంచి గోదావరి పుష్కరాల వరకు…
విశాఖపట్నం మెట్రో రైల్, బీచ్ కారిడార్‌కు అనుమతులు, ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఆర్థిక సహాయం, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణకు కేంద్ర సహకారం వంటి అంశాలను సీఎం ప్రస్తావించనున్నారు. అలాగే గోదావరి వరద జలాలను సమర్థంగా వినియోగించుకోవడం, నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రతిపాదనలపైనా చర్చ జరగనుంది.అక్టోబర్ 8న ఢిల్లీలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టెన్ రైజర్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌తో కలిసి చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం రాత్రికి అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇదే సందర్భంగా ప్రభుత్వాధినేతగా మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన నాయకత్వాన్ని చంద్రబాబు ప్రశంసించారు.
