క్రైమ్ మిర్రర్ : భర్త మృతిని గుండెపోటుగా చిత్రీకరించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ అతడి మొబైల్ ఫోన్‌లో బయటపడిన ఓ చాట్ మొత్తం వ్యవహారాన్ని మార్చేసింది. భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
లోహియా నగర్‌కు చెందిన 30 ఏళ్ల తాలిబ్‌కు బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల ఇల్మాతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. సెప్టెంబర్ 28న పని ముగించుకుని ఇంటికి వచ్చిన తాలిబ్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడని ఇల్మా అతడి సోదరుడు అక్రమ్‌కు తెలిపింది. కొద్దిసేపటికే మంచంపై ఉన్న తాలిబ్ మృతి చెందాడని, గుండెపోటుతో చనిపోయాడని కుటుంబ సభ్యులను నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు తాలిబ్ మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే కొంతకాలానికే అతడి మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానాలు మొదలయ్యాయి.
మొబైల్ ఫోన్‌తో బయటపడిన రహస్యం
అక్టోబర్ 1న తాలిబ్ బంధువు రైస్ ఇల్మా ఇంటికి వెళ్లాడు. తాలిబ్ మొబైల్ ఫోన్ కనిపించకపోవడంతో ఆరా తీయగా, అతడి దుస్తుల కింద ఫోన్ లభించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫోన్‌ను పరిశీలించగా తాలిబ్, ఇల్మా ప్రియుడిగా చెబుతున్న అమన్ మధ్య జరిగిన సంభాషణలు బయటపడ్డాయి. తన భార్యతో మాట్లాడవద్దని తాలిబ్ అమన్‌ను గతంలో హెచ్చరించినట్లు ఆ చాట్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం మరింత బలపడింది.
భర్తను కొట్టిన తర్వాత ప్రియుడికి ఫోన్?
కుటుంబ సభ్యులు గట్టిగా ప్రశ్నించడంతో ఇల్మా భర్త హత్యకు సంబంధించిన విషయాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే తాలిబ్ తనను వేధించేవాడని, తనపై దాడి చేసేవాడని ఆమె ఆరోపించినట్లు సమాచారం. సెప్టెంబర్ 28న కూడా తాలిబ్ తనపై దాడి చేశాడని చెప్పి ఇల్మా అమన్‌కు ఫోన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో అమన్ తన స్నేహితుడితో కలిసి అక్కడికి వచ్చాడని, అనంతరం ముగ్గురూ కలిసి తాలిబ్‌పై దాడి చేసినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. ఆ తర్వాత అమన్ చున్నీతో తాలిబ్ గొంతు బిగించి హత్య చేసినట్లు ఇల్మా వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు. హత్య అనంతరం ఇల్మాను వివాహం చేసుకుంటానని అమన్ హామీ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
సమాధి నుంచి మృతదేహం వెలికితీత
తాలిబ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి కోరారు. అనుమతి లభించడంతో అక్టోబర్ 6న తాలిబ్ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తాలిబ్ మృతి నిజంగా గుండెపోటుతో జరిగిందా? లేక హత్యకు గురయ్యాడా? అనే విషయంపై పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారనుంది. అదే సమయంలో ఈ ఘటనలో ఇల్మాతో పాటు అమన్, అతడి స్నేహితుడి పాత్రపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
also read : ఢిల్లీలో ఘోరం.. ఒక్కసారిగా కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
