క్రైమ్ మిర్రర్ : సినిమా కథను తలపించేలా నేరానికి ప్రణాళిక రచించిన ఓ వ్యక్తి.. చివరకు తాను చేసిన చిన్న తప్పిదంతో పోలీసులకు చిక్కాడు. తండ్రితో ఉన్న భూ వివాదం నేపథ్యంలో బిహార్‌కు చెందిన శివ్ శంకర్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. శివ్ శంకర్ కొంతకాలంగా తన భార్యతో కలిసి సూరత్‌లో నివసిస్తున్నాడు. అతడికి తన తండ్రి రఘువీర్‌తో భూమికి సంబంధించిన వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల ‘దృశ్యం 3’ సినిమా చూసిన శివ్ శంకర్.. సినిమాలో నేరం చేసిన వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అనుసరించిన వ్యూహంతో ప్రభావితమైనట్లు విచారణలో వెల్లడైంది. తండ్రిని హత్య చేసి.. ఆ సమయంలో తాను అక్కడ లేనట్లు ఆధారాలు సృష్టించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
2 వేల కిలోమీటర్లు ప్రయాణించి..
తన ప్రణాళికలో భాగంగా జూలై 26న సూరత్ నుంచి బిహార్‌లోని సమస్తిపూర్‌కు బయలుదేరాడు. ప్రయాణానికి ముందే తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ఆఫ్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో తండ్రి ఇంటికి చేరుకున్న శివ్ శంకర్.. ఇంటి బయట నిద్రిస్తున్న రఘువీర్‌పై గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి సూరత్‌కు బయలుదేరాడు. తన ప్రణాళిక ప్రకారం మొబైల్‌ను ఆఫ్‌లోనే ఉంచుకున్నప్పటికీ.. మార్గమధ్యంలో ఒక్కసారి ఫోన్ ఆన్ చేసి భార్యతో మాట్లాడాడు. ఆ తర్వాత మళ్లీ మొబైల్‌ను స్విచ్ఆఫ్ చేశాడు.
ఒక్క ఫోన్ కాల్‌తో చిక్కుల్లోకి..
శివ్ శంకర్ తండ్రి అంత్యక్రియలకు హాజరుకాకపోవడం పోలీసులకు అనుమానం కలిగించింది. మరోవైపు హత్య జరిగిన సమయంలో అతడి మొబైల్ కదలికలను పరిశీలించగా.. మధ్యలో కొద్దిసేపు ఫోన్ ఆన్ చేసి భార్యతో మాట్లాడిన విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు శివ్ శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతడు తండ్రి హత్యకు పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
సినిమా చూసి ప్రణాళిక?
విచారణ సందర్భంగా ‘దృశ్యం 3’ సినిమా చూసిన తర్వాతే హత్యకు సంబంధించిన ఆలోచన వచ్చిందని శివ్ శంకర్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. సినిమాలో నేరం జరిగిన సమయంలో తాను మరోచోట ఉన్నట్లు ఆధారాలు సృష్టించి పోలీసులను తప్పుదోవ పట్టించే విధానాన్ని చూసి.. తాను కూడా అదే తరహాలో తప్పించుకోవచ్చని భావించినట్లు వెల్లడించినట్లు సమాచారం. అయితే.. చివరకు భార్యకు చేసిన ఒక్క ఫోన్ కాల్, హత్య అనంతరం అతడి ప్రవర్తన పోలీసుల అనుమానాలకు కారణమై.. నిందితుడిని పట్టుకునేందుకు కీలకంగా మారింది.
also read : ఆస్తుల యుద్ధంలో ఎవరిది పై చేయి?!
