తాను ఇష్టపడిన యువతిని వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడంతో మేనమామపై కక్ష పెంచుకున్న ఓ యువకుడు, అదే ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. తన స్నేహితుడితో కలిసి మేనమామ ఇంటి తాళాలు పగలగొట్టి నగదు, బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి కాంట్రాక్టర్స్ కాలనీకి చెందిన మహమ్మద్ మగ్దూమ్ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఇందారం మండలం కాసింపల్లి గ్రామానికి చెందిన అతడి మేనమామ షేక్ సలీం కుమార్తెను వివాహం చేసుకోవాలని మగ్దూమ్ భావించాడు. అయితే సలీం తన కుమార్తెకు వేరే వ్యక్తితో వివాహం జరిపించడంతో మగ్దూమ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. దీంతో మేనమామపై కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలో సెప్టెంబర్ 28న సలీం కుటుంబ సభ్యులు తమ కుమారుడి వివాహానికి సంబంధించిన దుస్తులు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన మగ్దూమ్, తన స్నేహితుడు సబ్బని లక్ష్మీనారాయణతో కలిసి అక్కడికి వెళ్లాడు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన ఇద్దరూ బీరువాలోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు.
అంతటితో ఆగకుండా సమీపంలోని మరో మేనమామ ఖాజా పాషా ఇంట్లోనూ ఇద్దరూ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన నగదును మగ్దూమ్ రూ.35 వేలు, లక్ష్మీనారాయణ రూ.25 వేలుగా పంచుకున్నారు. అనంతరం ఆ డబ్బును హైదరాబాద్‌లో జల్సాలకు ఖర్చు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇందారం ఎక్స్ రోడ్ వద్ద మహమ్మద్ మగ్దూమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 6 తులాల బంగారు ఆభరణాలు, 45 తులాల వెండి ఆభరణాలు, రూ.13,300 నగదు, ఒక మోటార్‌సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో మరో నిందితుడైన సబ్బని లక్ష్మీనారాయణ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు. అరెస్టు చేసిన మగ్దూమ్‌ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
also read: పార్టీ నుంచి ఎమ్మెల్యే సుఖ్వీర్ సింగ్ మైసర్ఖానా బహిష్కరణ.. అసలు కారణం ఇదే!
