-
ల్యాండ్ పూలింగ్ మినహాయింపులపై కీలక నిర్ణయం
-
కటాఫ్ తేదీ ప్రకటన
-
సీఆర్డీఏ ఉత్తర్వులు జారీ
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని భూముల పై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామకంఠం భూముల ల్యాండ్ ఫూలింగ్ మినహాయింపులకు సంబంధించి సిఆర్డిఏ కీలక నిర్ణయం తీసుకుంది.
రాజధాని నిర్మాణ విస్తరణ ప్రక్రియలో భాగంగా.. ఇన్నాళ్లు గ్రామకంఠ భూముల సరిహద్దులు, ల్యాండ్ ఫూలింగ్ మినహాయింపులపై నెలకొన్న ప్రతిష్టంభను తెరదించుతూ అధికారులు స్పష్టమైన కటాఫ్ తేదీని ప్రకటించారు.
సిఆర్డిఏ తీసుకున్న ఈ నిర్ణయంతో అమరావతి పరిధిలోని 29 రాజధాని గ్రామాల భూ యజమానులకు, నివాసితులకు దశాబ్ద కాలంగా వేధిస్తున్న సమస్య నుంచి ఉపశమనం లభించింది.
-
పూర్తిగా మినహాయింపులు..
అమరావతి పరిధిలో నూతన నిబంధనల ప్రకారం నిర్ణీత కటాఫ్ తేదీ నాటికి గ్రామకంఠం రికార్డుల్లో, గ్రామ సరిహద్దుల్లో నమోదై ఉన్న నివాస గృహాలు, ఖాళీ స్థలాలు, సంప్రదాయ పూరిల్లు, పక్కా భవనాలను ల్యాండ్ పూలింగ్ నుంచి పూర్తిగా మినహాయిస్తున్నట్లు సిఆర్డిఏ వెల్లడించింది.
గతంలో గ్రామ కంటాల పరిమితులను సరిగ్గా కొలవకపోవడం వల్ల అనేక రకాల వివాదాలు ఉత్పన్నమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పూలింగ్ పరిధిలోకి ఇల్లు రావడం, మరికొన్ని చోట్ల నిర్మాణాలను కూడా పూలింగ్ పరిధిలోకి చేర్చడంతో ఆయా గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. ఇప్పుడు సిఆర్డిఎస్ స్పష్టమైన కటాఫ్ తేదీని ప్రామాణికంగా తీసుకోవడంతో సదరు భూములు స్థానికుల సొంత ఆస్తిగానే మిగిలిపోనున్నాయి.
-
సన్నాహాలు మొదలు..
కటాఫ్ తేదీ నాటికి ఉన్న నిర్మాణాలకు పూర్తిస్థాయిలో అధికారిక హక్కు పత్రాలు, ప్రాపర్టీ ఐడీలను మంజూరు చేసేందుకు సిఆర్డిఏ సన్నాహాలు చేస్తోంది. డిజిటల్ రీ సర్వే ద్వారా గ్రామ కంఠం సరిహద్దులను పక్కాగా గుర్తించి… ఆక్రమణలకు గురికాకుండా సరిహద్దు రాళ్ళను పాతనున్నారు.
దీనివల్ల స్థానిక యజమానులకు తమ స్థలాలపై పూర్తి చట్టబద్ధమైన హక్కులు లభించడమే కాకుండా… బ్యాంకు రుణాలు పొందడానికి, క్రయవిక్రయాలకు ఉన్న అన్ని అడ్డంకులు శాశ్వతంగా తొలగిపోనున్నాయి. గ్రామ కంఠం భూములకు కూడా పూర్తిస్థాయి క్లియరెన్స్ రావడం రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కొత్త ఊపు రానుంది.
దీనిపై అమరావతి రైతులు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారులు త్వరలోనే గ్రామాల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించి.. గ్రామకంఠం సర్వే రికార్డులను ప్రత్యక్షంగా ప్రదర్శించి.. రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
