-
దళిత మహిళపై దాడి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు!
-
సంఘాల డబ్బుల వ్యవహారంలో వివాదం
-
బహిరంగంగా దుర్భాషలు, దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు
-
చింతపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు విచారణ..
చింతపల్లి(క్రైమ్ మిర్రర్): సంఘాలకు సంబంధించిన డబ్బుల వ్యవహారంలో, తలెత్తిన వివాదం దళిత మహిళపై దాడి కేసు నమోదయ్యే వరకు వెళ్లింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పీకే మల్లేపల్లి గ్రామానికి చెందిన, వీవోఏ గనిపల్లి మాధవిపై దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు చింతపల్లి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంతో పాటు, భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ ఎఫ్ఐఆర్లో నిందితుడిగా కుప్పల అమర్నాథ్ పేరును పేర్కొన్నారు. ఈ ఘటన అక్టోబర్ 2న మధ్యాహ్నం జరిగినట్లు, అదే రోజు సాయంత్రం బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
-
సంఘాల డబ్బుల వ్యవహారమే వివాదానికి కారణమా?
పీకే మల్లేపల్లి గ్రామ పంచాయతీలో వీవోఏగా విధులు నిర్వహిస్తున్న మాధవిపై, సంఘాలకు సంబంధించిన డబ్బుల విషయంలో కొందరు ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలపై గ్రామపంచాయతీ వద్ద మాధవి ప్రశ్నిస్తుండగా, అదే గ్రామానికి చెందిన కుప్పల అమర్నాథ్ తన పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తూ, దుర్భాషలాడి దాడికి పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ద్వారా తెలుస్తోంది.
అయితే డబ్బుల వ్యవహారంపై అసలు వివాదం ఏమిటి? ఆ ఆరోపణలకు ఆధారాలున్నాయా? ఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులు ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. బాధితురాలి ఫిర్యాదుపై చింతపల్లి పోలీస్స్టేషన్లో క్రైమ్ నెంబర్ 172/2026గా కేసు నమోదైంది.
భారతీయ న్యాయ సంహితలోని 74, 115(2), 352 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంలోని 3(1)(ఆర్), 3(1)(ఎస్), 3(2)(విఏ) సెక్షన్లను పోలీసులు నమోదు చేశారు. గ్రామస్థాయిలో సంఘాల ఆర్థిక వ్యవహారాలపై ఆరోపణలు తలెత్తినప్పుడు, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి రికార్డుల ఆధారంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది.
ఆరోపణలు నిజమైతే బాధ్యత వహించాల్సిన వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకునే మార్గాలు ఉన్నాయి. అదే సమయంలో ఆరోపణలను ప్రశ్నించిన వ్యక్తిపై బహిరంగంగా దుర్భాషలు, దాడి జరిగిందన్న ఫిర్యాదు రావడం గ్రామీణ స్థాయిలో నెలకొన్న వివాదాలు ఏ స్థాయికి దారితీస్తున్నాయో చూపిస్తోంది.
మహిళ గౌరవానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దాడికి సంబందించిన వీడియో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ దాడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యక్తుల వల్ల ప్రమాదం ఉందని, సదరు మహిళా గతంలోనే పిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఈ దాడిపై దేవరకొండ డిఎస్పీ ఏ విధమైన విచారణ, చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..
