మారుతున్న జీవనశైలి కారణంగా ఒకప్పుడు వృద్ధులకే పరిమితమైన బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఇప్పుడు యువతలోనూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. మెదడుకు వెళ్లే రక్త ప్రసరణకు అకస్మాత్తుగా అంతరాయం కలగడం లేదా ఆక్సిజన్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, అలాగే మెదడులోని రక్తనాళాలు చిట్లిపోవడం వంటి కారణాల వల్ల మనిషికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. సరైన సమయంలో దీనిని గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి సులభంగా బయటపడవచ్చు.
శరీరం అందించే కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా స్ట్రోక్ ముప్పును ముందుగానే పసిగట్టవచ్చు. అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం, కంటి చూపు సడన్‌గా తగ్గిపోవడం, స్పష్టంగా మాట్లాడలేకపోవడం లేదా మాట తడబడటం వంటివి దీనికి సంబంధించిన ప్రధాన లక్షణాలు. అలాగే, శరీరంలో ఒకవైపు చేయి అకారణంగా బలహీనపడటం, ముఖం ఒకవైపు వాలిపోయినట్లు అనిపించడం లాంటి ప్రమాదకరమైన సంకేతాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే అప్రమత్తం కావాలని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
ఈ మహమ్మారి బారిన పడటానికి అనేక జీవనశైలి లోపాలు కారణమవుతున్నాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం (డయాబెటిస్), శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం దీనికి ప్రధాన కారణాలు. వీటితో పాటు మితిమీరిన మద్యపానం, రోజువారీ జీవితంలో కనీస శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం వంటివి బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి, ఈ లక్షణాలపై సరైన అవగాహన పెంచుకుని తక్షణ వైద్యం తీసుకోవడం ఎంతో ముఖ్యం.
