క్రైమ్ మిర్రర్ : ముంబైలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి మరణించినా ఆయనను తనకు దూరం చేయకూడదని భావించిన ఓ మహిళ.. మృతదేహాన్ని దహనం చేయకుండా సుమారు నాలుగేళ్ల పాటు భద్రపరిచినట్లు పోలీసులు గుర్తించారు. చివరకు మూసివేసి ఉన్న డే కేర్ సెంటర్ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది.
ముంబైలోని మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా మూసివేసి ఉన్న ఓ డే కేర్ సెంటర్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. రోజులు గడిచేకొద్దీ వాసన తీవ్రం కావడంతో ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగి ఉండొచ్చని భావించిన వారు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు డే కేర్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. గేటుకు ఉన్న తాళాన్ని తొలగించి లోపలికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కుళ్లిపోయిన స్థితిలో ఓ వృద్ధుడి మృతదేహం కనిపించింది. అనంతరం వివరాలు సేకరించగా, ఆ వ్యక్తి 2022లో గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.
మృతుడి కుమార్తె తండ్రిపై ఉన్న అనుబంధంతో ఆయన మరణాన్ని అంగీకరించలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. తండ్రిని తనకు దగ్గరగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో అంత్యక్రియలు నిర్వహించకుండా మృతదేహాన్ని సంరక్షించాలని ఆమె నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందుకోసం ఓ విదేశీ సంస్థ సహాయంతో మృతదేహాన్ని భద్రపరిచే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
ఈ ఘటన వెనుక ఉన్న కుటుంబ పరిస్థితులు, మృతదేహాన్ని ఇన్నేళ్లుగా ఎలా భద్రపరిచారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత మహిళ తన తరఫున న్యాయపరమైన విషయాలను చూసుకునేందుకు న్యాయవాదులను నియమించుకున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. కేసుకు సంబంధించిన కుటుంబ, చట్టపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
also read : ఓయూ పరిధిలో రోడ్డు ప్రమాదం.. స్కూటీపై వెళ్తున్న వ్యక్తి మృతి
