క్రైమ్ మిర్రర్ : బిహార్‌లోని జముయిలో బాలికపై కొందరు యువకులు దాడి చేసి, వేధింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సెప్టెంబర్ 19న రాత్రి సమయంలో ఓ బాలుడు, బాలిక కోచింగ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా కొందరు యువకులు వారిని అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలికను రక్షించేందుకు ప్రయత్నించిన బాలుడిపై కూడా నిందితులు దాడి చేసినట్లు సమాచారం. ఈ మొత్తం ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది విస్తృతంగా వైరల్ అయింది.
వీడియో వెలుగులోకి వచ్చిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల నుంచి తొలుత తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. అనంతరం వైరల్ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి, మొత్తం ఏడుగురిని నిందితులుగా గుర్తించారు. ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తును వేగవంతం చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు.
ఈ కేసులో నందన్ యాదవ్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఘటన తర్వాత అతడు పరారీలో ఉండటంతో అతడి కోసం ప్రత్యేకంగా గాలింపు చేపట్టారు. అతడు ఓ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో నందన్ యాదవ్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల్లో అతడి కాలికి గాయాలయ్యాయి. గాయపడిన నందన్ యాదవ్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడికి ఇతర అక్రమ కార్యకలాపాలతోనూ సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసులో ఇంకా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
also read : తమిళనాడులో అల్పాహార పథకం విస్తరణ.. ఇక 8వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్
