Homeక్రైమ్బిహార్‌లో బాలికపై లైంగిక వేధింపులు కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై పోలీసుల కాల్పులు

బిహార్‌లో బాలికపై లైంగిక వేధింపులు కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై పోలీసుల కాల్పులు

బిహార్‌లో పదో తరగతి బాలికపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ.. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నందన్‌ యాదవ్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు కాల్పులు జరిపారు. జముయ్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నందన్‌ యాదవ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అతడు వారి నుంచి తప్పించుకునేందుకు యత్నించాడు. అంతేకాకుండా పోలీసులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించడంతో ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నందన్‌కు గాయాలు కావడంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు మైనర్లుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఘటనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని బిహార్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్‌ కుమార్‌ చౌదరి స్పష్టం చేశారు.

పోలీసులు వేగంగా స్పందించి చర్యలు చేపట్టారని మంత్రి శ్రవణ్‌ కుమార్‌ తెలిపారు. బాలికపై జరిగిన ఘటన తీవ్రంగా బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించబోమని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

సెప్టెంబర్‌ 19న వెలుగులోకి వచ్చిన వీడియో

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సెప్టెంబర్‌ 19న బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కోచింగ్‌ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న పదో తరగతి విద్యార్థిని, ఆమెతో ఉన్న స్నేహితుడిని కొందరు యువకులు అడ్డుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిపై దాడి చేసి.. బాలికను అతడి నుంచి వేరు చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వైరల్‌ అయిన దృశ్యాల్లో నందన్‌ యాదవ్‌ బాలికను పట్టుకుని కొంత దూరం తీసుకెళ్లినట్లు కనిపించింది. బాలిక తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అతడు ఆమెను అడ్డుకున్నట్లు వీడియోలో నమోదైంది. ఈ క్రమంలో బాలుడు అక్కడికి వచ్చి బాలికను రక్షించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

వీడియో బయటకు వచ్చిన వెంటనే పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులందరినీ గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు.

also read: యమునా ప్రక్షాళనకు బిట్టు తబాహీ శ్రీకారం.. తొలి రోజే 585 కిలోల చెత్త తొలగింపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు