పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు, ముఖ్యంగా వర్క్‌ప్లేస్‌లో వాటి గురించి మాట్లాడటంలో ఉన్న సంకోచంపై నటి శ్రుతి హాసన్ తాజాగా స్పందించారు. పురుషులకు కూడా నెలసరి వస్తే.. మహిళల సమస్యలను మరింత సీరియస్‌గా తీసుకునేవారేమో అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. నటి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శ్రుతి.. తన వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకున్నారు.
శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. తాను పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ కారణంగా పీరియడ్స్ సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడతానని చెప్పారు. కెరీర్ ప్రారంభ దశలో షూటింగ్ సమయంలో నొప్పి, నీరసం ఉన్నప్పటికీ ఆ విషయం ఎవరికీ చెప్పడానికి ధైర్యం చేసేవారు కాదని గుర్తుచేసుకున్నారు.
పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడటం అప్పట్లో ఇబ్బందికరమైన విషయంగా అనిపించేదని ఆమె తెలిపారు. దీంతో షూటింగ్ సెట్‌లో తనకు ఎంత అసౌకర్యంగా ఉన్నా బయటకు చెప్పకుండా భరించేవారినని వివరించారు. కొన్ని సందర్భాల్లో తనలో శక్తి పూర్తిగా తగ్గిపోయేదని, తాను మామూలుగా కనిపించకపోయినా అందుకు కారణం ఏమిటో చుట్టూ ఉన్నవారికి తెలియదని పేర్కొన్నారు.
అయితే తన ఆలోచనా విధానాన్ని మార్చిన ఒక సంఘటనను కూడా శ్రుతి గుర్తుచేసుకున్నారు. తన సహనటుడికి మోకాలికి శస్త్రచికిత్స జరిగిన సమయంలో షూటింగ్ యూనిట్ మొత్తం అతని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని చెప్పారు. అతనికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ సిబ్బంది సహకరించిన విధానం చూసిన తర్వాత.. తన ఆరోగ్య సమస్య గురించి కూడా మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఆ తర్వాత ఓ దర్శకుడితో తొలిసారి తన సమస్య గురించి చెప్పానని శ్రుతి వెల్లడించారు. ఆ దర్శకుడికి కుమార్తె ఉండటంతో మహిళలు ఎదుర్కొనే ఇలాంటి సమస్యలపై ఆయన త్వరగా స్పందించారని చెప్పారు. ఆ సంభాషణ తర్వాత షూటింగ్ సెట్‌లో తనతో వ్యవహరించే విధానంలో కూడా మంచి మార్పు వచ్చిందని తెలిపారు. అప్పటి నుంచి తనకు ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని చెప్పేందుకు వెనుకాడటం లేదని శ్రుతి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సోహా అలీ ఖాన్ కూడా శ్రుతి అభిప్రాయానికి స్పందించారు. పురుషులకు కూడా పీరియడ్స్ ఉంటే.. ఎవరికెంత బ్లీడింగ్ అయింది, ఎవరి ట్యాంపూన్ పెద్దది వంటి విషయాలపై వాళ్లు పోటీ పడేవారేమో అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఇక శ్రుతి హాసన్ సినీ కెరీర్ విషయానికొస్తే.. గతేడాది రజినీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రంలో ఆమె కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించినప్పటికీ మిశ్రమ స్పందనను అందుకుంది. ఇటీవల ‘పెద్ది’ సినిమాలోని ఓ పాటలో శ్రుతి హాసన్ కనిపించారు. ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి తమిళ చిత్రం ‘ట్రైన్’, దుల్కర్ సల్మాన్‌తో కలిసి తెలుగు సినిమా ‘ఆకాశంలో ఒక తార’లో నటిస్తున్నారు.
also read: ఆస్కార్ రేసులో అనూహ్య ఎంపిక.. ‘ధురంధర్’కు షాక్.. భారత్ తరఫున ఆ మరాఠీ చిత్రమే!
