ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహానికి సంబంధించిన ముహూర్తాలు, వేడుకల వివరాలను సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఈ శుభకార్య వివరాలను పంచుకున్నారు.
వివాహ వేడుకల వివరాలు:-
నిశ్చితార్థం:- ఈ నెల 24వ తేదీన నిశ్చితార్థ వేడుక జరగనుంది.
వివాహం:- నవంబర్ 25న వైఎస్ అంజలి రెడ్డి వివాహ వేడుక వైభవంగా జరగనుంది.
రిసెప్షన్:- డిసెంబర్ 5న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
వైఎస్సార్ స్మృతివనం వద్ద తొలి ఆహ్వాన పత్రిక:- ఈ శుభకార్యానికి సంబంధించిన తొలి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ షర్మిల, ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఉంచి నివాళులర్పించారు. తండ్రి ఆశీస్సులు తీసుకున్న అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తన కుమార్తె వివాహం దైవ సంకల్పంతో జరుగుతోందని, దివంగత వైఎస్సార్ దీవెనలు తమ కుటుంబానికి ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటాయని భావోద్వేగంతో పేర్కొన్నారు. వైఎస్ కుటుంబంలో జరగబోయే ఈ వేడుకకు సంబంధించిన వార్త ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
