క్రైమ్ మిర్రర్ : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై గతంలో విధించిన సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కాంతి రాణా టాటాను సెప్టెంబర్ 4 నుంచి, విశాల్ గున్నీని సెప్టెంబర్ 5 నుంచి విధుల్లోకి తీసుకున్నారు.
అసలు వివాదం ఏంటి?
ముంబయికి చెందిన నటి కాదంబరీ జెత్వానీపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన వ్యవహారం అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. ఫోర్జరీ పత్రాలను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పటి ఐపీఎస్ అధికారులు పి. సీతారామాంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు నమోదయ్యాయి. వైఎస్సార్సీపీ నేత విద్యాసాగర్‌తో కలిసి కుట్రకు పాల్పడి, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తప్పుడు పత్రాలు, రికార్డులు రూపొందించారని ఆరోపణలు వచ్చాయి. జెత్వానీతో పాటు ఆమె కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారనే అభియోగాలు కూడా ఉన్నాయి.
ఈ వ్యవహారం బయటకు రావడంతో ప్రభుత్వం సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టింది. కేసులో నిందితుడిగా ఉన్న నిఘా విభాగం మాజీ అధిపతి పి. సీతారామాంజనేయులు కూడా సస్పెండ్ అయ్యారు. అనంతరం ఆయన ఆగస్టులో పదవీ విరమణ చేశారు. ఇదే కేసులో సస్పెన్షన్‌కు గురైన కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై ప్రభుత్వం తాజాగా సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి విధుల్లోకి తీసుకుంది.
also read : కెనడా నుంచి నలుగురు పంజాబీలు బహిష్కరణ.. కారణం ఇదే!
