-
కేటీఆర్ పిఏ, పిఆర్వో విచారణలో హై డ్రామా
-
పక్కా ప్రణాళిక వ్యూహంతో బిఆర్ఎస్
-
రాజకీయ బాధిత ప్రచార ఆయుధంగా మార్చుకున్న వైనం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రతి అంశాన్ని రాజకీయం చేసే పనిలో పడింది గులాబీ పార్టీ. అధికార కాంగ్రెస్ పార్టీని డామేజ్ చేసేందుకు కలిసివచ్చే ఏ అంశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు ఆ పార్టీ.
అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘర్షణల కేసు దర్యాప్తులో భాగంగా.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిఏ కంబాల మహేందర్ రెడ్డి, వీఆర్వో మాణిక్య మహేష్ లు సోమవారం సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు. అయితే ఆ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఓ పక్క ప్రణాళిక బద్ధమైన వ్యూహాత్మక రాజకీయం నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది.
న్యాయస్థానం ముందస్తు ఉపశమనం ఇస్తూ విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే వారు ఆ విచారణను రాజకీయ బాధిత ప్రచార ఆయుధంగా మార్చుకున్న తీరు మాత్రం ఆకట్టుకుంటుంది. ఉదయం స్టేషన్ కు వచ్చిన క్షణం నుంచి వెళ్లే వరకు.. జరిగిన పొలిటికల్ డ్రామా హై లెవెల్ లో ఉంది.
-
పండుగ పూట వేధింపులు అంటూ..
పండుగ పూట కూడా వేధిస్తున్నారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద జల్లడమే లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహం పన్నింది. విచారణ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణానికి తీసుకెళ్లడం.. తిరిగి పోలీస్ స్టేషన్కు తీసుకు రావడం లాంటి చట్టబద్ధమైన ప్రక్రియలను కూడా తమకు అనుకూల వీడియోల చిత్రీకరణకు అవకాశం గా మలుచుకున్నారు.
ప్రశాంతంగా సగాల్సిన విచారణ స్థలాన్ని కూడా ఒక హైడ్రామా వేదికగా మార్చేశారు. ఉద్రిక్తతలు సృష్టించే సమాచారంతో సోషల్ మీడియాలో నిరంతర లైవ్ అప్డేట్లు ఇస్తూ పబ్లిక్ అటెన్షన్ ను తమవైపు తిప్పుకోవడంలో గులాబీ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది.
-
దాడి అంటూ ఆరోపణలు..
మరోవైపు విచారణకు హాజరైన వారిపై దాడి చేసేందుకు మాస్కు ధరించిన కొందరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చారు అంటూ గులాబీ పార్టీ అగ్రనేతలు ఓ అంశాన్ని తెరపైకి తెచ్చారు. కనీసం ఊహకు అందని ఈ ఆరోపణను సోషల్ మీడియాలో గట్టి ప్రచారం చేశారు. ఏకంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ కేటీఆర్ స్థాయినేత డిమాండ్ చేశారు.
వాస్తవానికి రాష్ట్రంలోనే అత్యంత రక్షణ ఉన్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి దాడి చేసే ధైర్యం ఎవరైనా చేస్తారా? విచారణ సమయంలో దాడికి పూనుకుంటారా? కనీసం ప్రాథమిక విచక్షణను కూడా పక్కన పెట్టి.. తమ పిఎ, వీఆర్వోలను విచారించడానికి కూడా తట్టుకోలేకపోతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక గులాబీ పార్టీ ఆడిన వ్యూహాత్మక మైండ్ గేమ్ స్పష్టంగా అర్థం అవుతుంది.
చట్ట ప్రకారం జరిగే సాధారణ విచారణలను సైతం రాజకీయ వేధింపులు అని ముద్ర వేయడం ద్వారా.. భవిష్యత్తులో కేటీఆర్, హరీష్ రావు లాంటి ప్రధాన నేతలను విచారణకు పిలవకుండా పోలీసులపై మానసిక ఒత్తిడి పెంచడమే వీరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
-
కఠినంగా వ్యవహరించాల్సిందే..
అయితే పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తూ.. మెత్తదనంతో సైలెంట్ గా ఉన్న ప్రతిసారి రాజకీయ నాయకులు తమ నేరరోపణల నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి మైండ్ గేమ్లు ఆడతారో దీని ద్వారా అర్థం అవుతోంది. ఈ తరహా ప్రచారాలకు చెక్ పెట్టాలంటే కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
నిందితులు విచారణను రాజకీయ క్రీడగా మారుస్తున్నప్పుడు.. చట్టం తన పని తాను చేసుకు పోవడమే కాకుండా పోలీస్ యంత్రాంగం కూడా తమ వైపు నుంచి కఠినమైన, పారదర్శకమైన కౌంటర్ స్ట్రాటజీతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
