-
ఆపిల్ ఫోల్డబుల్, 80s వైబ్స్ పేరుతో ప్రత్యర్థులపై దుష్ప్రచారం
-
ప్రతీకారంగా ప్రత్యర్ధులు నీచమైన పోస్టులతో విరుచుకుపడుతున్న వైనం
-
ఒక్క క్లిక్ తో కూలిపోతున్న దశాబ్దాల రాజకీయ ప్రతిష్ట
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: రాజకీయం రూటు తప్పుతోంది. డిజిటల్ యుగంలో సిద్ధాంతం పక్కకు తప్పుకొని.. వ్యక్తిత్వ హననం తెరపైకి వస్తోంది. ప్రతి రాజకీయ పార్టీకి కాలకేయ సోషల్ మీడియా సైన్యం సమకూరుతోంది. అధికారిక, అనధికారిక సోషల్ మీడియా సైన్యాలు తెరపైకి వస్తున్నాయి.
ప్రత్యర్థులను దెబ్బ కొట్టే క్రమంలో.. కనీస విచక్షణను, సంస్కారాన్ని గాలికి వదిలేస్తున్నాయి. తమకే తెలివితేటలు ఉన్నాయని.. తమ చేతుల్లోనే స్మార్ట్ ఫోన్లు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయన్న భ్రమలో కొందరు అతి చేస్తున్నారు. వికృతి చేష్టలకు పాల్పడుతున్నారు. అంతిమంగా తమ సొంత నాయకుల పరువును నడి రోడ్డుపై బజారున పడేస్తున్నారు.
-
జాతీయస్థాయిలో రచ్చ..
గత కొద్ది రోజులుగా జాతీయస్థాయిలో సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చ నడుస్తోంది. ఆపిల్ పోల్డబుల్ ఫోన్, 80s వైబ్స్ పేరుతో.. ఏఐ సాయంతో ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లను అత్యంత అసభ్యకరమైన రీతిలో జోడించి.. మార్ఫింగ్ చిత్రాలు, రీల్స్ సృష్టిస్తున్నారు.
ఒక వర్గం ఈ రకమైన కంటెంట్ ను వదిలి సంబరపడుతోంది. కానీ దానికి ప్రతి కరంగా ఎదుటి వర్గం మరింత దిగజారి నీచమైన పోస్టులతో విరుచుకుపడుతోంది. అయితే ఈ పరస్పర పైశాచిక ఆనందంలో.. చివరకు విపరీతంగా ట్రోలింగుకు గురవుతోంది తాము అభిమానించే నేతలే.
-
తెలుగు రాష్ట్రాల్లో అధికం..
తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విశ్వ సంస్కృతి పెరిగింది. అయితే ఎప్పుడో ఇక్కడ పరిమితులు దాటిపోయాయి. చంద్రబాబు, జగన్, పవన్, లోకేష్, కేటీఆర్ వంటి నాయకులను టార్గెట్ చేసుకుని ఫేక్ వీడియోలు, ఏఐ డీప్ ఫేక్ లు, మార్ఫింగ్ ఫోటోలతో చేసి దాడి విపరీతంగా పెరిగింది.
ఒకరి కుటుంబ సభ్యులను, వ్యక్తిగత జీవితాలను లాగి వికృతానందం పొందుతున్నారు. ఒక పార్టీ సోషల్ మీడియా విభాగం అవతలి పార్టీ నేతపై అసభ్యకర పోస్టు పెడితే… దానికి కౌంటర్ గా అవతలి వర్గం అంతకంటే ఘోరమైన దూషణతో బదులిస్తోంది. దీనివల్ల నిత్యం సోషల్ మీడియా ఒక మురికి కాలువల మారిపోతుంది. ప్రజాక్షేత్రంలో దశాబ్దాలుగా నాయకులు నిర్మించుకున్న రాజకీయ ప్రతిష్ట.. ఒక్క క్లిక్ తో గంగపాలు అవుతోంది.
