క్రైమ్ మిర్రర్ : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఓ మెట్రో స్టేషన్లో మహిళా ప్రయాణికులు, లేడీ ఆర్పీఎఫ్ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. నలుగురు మహిళలు పరస్పరం జుట్లు పట్టుకుని నేలపై పడుతూ కొట్టుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సెప్టెంబర్ 7న రాత్రి సుమారు 10 గంటల సమయంలో భవానీపూర్లోని నేతాజీ భవన్ మెట్రో స్టేషన్కు ఇద్దరు మహిళా ప్రయాణికులు వచ్చినట్లు సమాచారం. అక్కడ విధుల్లో ఉన్న మహిళా ఆర్పీఎఫ్ సిబ్బందితో వారు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. సదరు మహిళల నుంచి మద్యం వాసన వచ్చినట్లు సిబ్బంది ఆరోపించారు. అంతేకాకుండా స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా స్టేషన్ మాస్టర్తోనూ వారు దురుసుగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు.
వాగ్వాదం కాస్తా తీవ్ర స్థాయికి చేరడంతో ఇరువర్గాల మధ్య తోపులాట మొదలైంది. అనంతరం నలుగురు మహిళలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. జుట్లు పట్టుకోవడం, చెంపదెబ్బలు కొట్టుకోవడం, పిడిగుద్దులతో దాడి చేసుకోవడంతో మెట్రో స్టేషన్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరో మహిళా మెట్రో సిబ్బంది అక్కడికి చేరుకుని గొడవను నిలువరించేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రయాణికుల్లోని ఓ మహిళపై ఒక వ్యక్తి పలుమార్లు దాడి చేసిన దృశ్యాలు కూడా వీడియోలో నమోదయ్యాయి.
సమాచారం అందుకున్న భవానీపూర్ పోలీసులు వెంటనే మెట్రో స్టేషన్కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం సంబంధిత మహిళల కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. చివరకు మహిళా ప్రయాణికులు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగినట్లు సమాచారం. విధుల్లో ఉన్న సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినందుకు ఇద్దరు మహిళా ప్రయాణికులకు రూ.1,000 చొప్పున జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మెట్రో స్టేషన్లో మహిళలు పరస్పరం దాడి చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
also read : బాధిత కుటుంబాన్ని బెదిరిస్తే ఊరుకోం : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
