ఛత్తీస్‌గఢ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మొబైల్‌లో వీడియోలు చూస్తున్న సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ పదేపదే నిలిచిపోవడంతో ఓ మహిళ తీవ్ర అసహనానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు నెట్‌వర్క్ సమస్య ఒక్కటే కారణమా? లేక మరేదైనా నేపథ్యం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
కోర్బా జిల్లాలోని కేరకఛార్ గ్రామానికి చెందిన 52 ఏళ్ల మంగ్లో బాయి సారథి ఈ ఘటనలో మృతి చెందారు. ఈ నెల 5న ఆమె పురుగుల మందు సేవించగా కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. తొలుత స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించిన అనంతరం కోర్బా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు.
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. మంగ్లో బాయికి మొబైల్‌లో రీల్స్, టీవీ సీరియల్స్ చూడటం అలవాటుగా ఉండేది. ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం భోజనం చేస్తూ ఫోన్‌లో వీడియోలు చూస్తుండగా ఇంటర్నెట్ సిగ్నల్ సమస్య తలెత్తింది. వీడియోలు పదేపదే ఆగిపోవడంతో ఆమె తీవ్రంగా ఆగ్రహానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆ తర్వాత కోపంతో ఫోన్‌ను నేలపై కొట్టి గదిలోకి వెళ్లిన ఆమె తలుపు వేసుకున్నట్లు చెప్పారు. కొంత సమయం తర్వాత బయటకు వచ్చిన ఆమె వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. గదిలో పురుగుల మందు డబ్బా ఖాళీగా ఉండటాన్ని గుర్తించి ఆమె అది సేవించినట్లు అనుమానించారు.
వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
కేవలం ఇంటర్నెట్ సిగ్నల్ సమస్యే ఆమె తీవ్ర నిర్ణయానికి కారణమైందా? లేదా వ్యక్తిగతంగా మరేదైనా సమస్య ఉందా? అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: 13 రోజులకే పాస్‌పోర్ట్.. శ్రీకాకుళం చిన్నారి అరుదైన ప్రపంచ రికార్డు
