పశ్చిమ బెంగాల్‌లో బాల్య వివాహాలు, మైనర్ల ప్రసవాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. 18 ఏళ్లు పూర్తికాకముందే బాలిక గర్భం దాల్చిన సందర్భాల్లో ఆమె భర్తపై POCSO చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సుమోటోగా పరిగణించి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
సోమవారం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన సీఎం.. రాష్ట్రంలో బాల్య వివాహాలు, మైనర్ల ప్రసవాల సంఖ్య ఆందోళనకరంగా ఉందన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. 18 ఏళ్లలోపు బాలిక గర్భం దాల్చినట్లు గుర్తిస్తే, సంబంధిత భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
POCSO చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని సీఎం తెలిపారు. అంతేకాకుండా నిందితులకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలను నిలిపివేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు.
పెళ్లిళ్లు జరిపించే వారిపైనా చర్యలు
మైనర్లకు వివాహాలు జరిపించే పురోహితులు, ఖాజీలు కూడా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సువేందు అధికారి స్పష్టం చేశారు. బాల్య వివాహానికి సహకరించే ఇతర వ్యక్తులపైనా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ గణాంకాలను ప్రస్తావించిన సీఎం.. 2016 జనవరి నుంచి 2026 జూన్ 30 వరకు పశ్చిమ బెంగాల్‌లో సుమారు 60 వేల మంది బాలికలు 18 ఏళ్లు పూర్తికాకముందే తల్లులయ్యారని వెల్లడించారు. జిల్లాల వారీగా చూస్తే ముర్షిదాబాద్‌లో అత్యధికంగా 12,847 కేసులు నమోదైనట్లు తెలిపారు. సౌత్ 24 పరగణాస్ జిల్లా 4,178 కేసులతో తర్వాతి స్థానంలో ఉందన్నారు.
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు
బాల్య వివాహాలను అరికట్టేందుకు చట్టపరమైన చర్యలతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తృత ప్రచారం చేపడతామని సీఎం తెలిపారు.
బాలికలకు 18 ఏళ్లు పూర్తికాకముందే వివాహం చేయడం, వారిని గర్భధారణకు గురిచేయడం వంటి ఘటనలను అరికట్టేందుకు అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించనున్నారు. బాల్య వివాహాలకు సహకరించే వారిని గుర్తించి చట్టం పరిధిలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
గమనిక: బాల్య వివాహం కేవలం సామాజిక సమస్య మాత్రమే కాదని, మైనర్ల హక్కులు, భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశమని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు గుర్తించినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు.
also read: రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ.. రెండ్రోజుల పాటు కొనసాగనున్న పర్యటన
