Homeక్రైమ్గ్రామస్తులపై చిరుత దాడి.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

గ్రామస్తులపై చిరుత దాడి.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

క్రైమ్ మిర్రర్ : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో చిరుత సంచారం గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తోంది. ఉమర్దా ఖేడా గ్రామ పరిధిలో ఓ చిరుత వరుసగా గ్రామస్తులపై దాడులకు పాల్పడింది. కేవలం 18 గంటల వ్యవధిలో ఐదుగురిపై దాడి చేయగా.. ఒకరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బుధవారం కొందరు గ్రామస్తులు ఓ ఇరుకైన మార్గంలో కలిసి వెళ్తుండగా.. పొదల్లో నుంచి ఒక్కసారిగా చిరుత బయటకు వచ్చింది. ముందుగా నడుస్తున్న కాలూపై దాడి చేసి అతడిని ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన ఇతర గ్రామస్తులు రాళ్లు విసరడంతో చిరుత కాలూను వదిలి అక్కడి నుంచి పారిపోయింది.

అంతకుముందు కూడా అదే చిరుత మరో వ్యక్తిపై దాడి చేసి అతడి భుజానికి గాయపరిచినట్లు అధికారులు తెలిపారు. 45 ఏళ్ల లోగ్రి బాయిపై కూడా చిరుత దాడి చేయగా.. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. దీంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది.

చిరుత దాడుల్లో గాయపడిన లోగ్రి బాయితో పాటు 60 ఏళ్ల జగ, 20 ఏళ్ల హితేష్‌, 40 ఏళ్ల కాలూను మహారాణా భూపాల్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మరోవైపు మంగళవారం సాయంత్రం 45 ఏళ్ల లోగర్‌ లాల్‌ మీనాపై కూడా చిరుత దాడి చేసింది. తీవ్ర గాయాలతో అతడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో గ్రామంలో భయాందోళన మరింత పెరిగింది.

వరుస దాడులతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామ పరిసరాల్లో పలు చోట్ల బోనులు ఏర్పాటు చేయడంతో పాటు దాని కదలికలను గుర్తించేందుకు కెమెరాలను అమర్చారు. భిందర్‌, కురాబాద్‌, ఉదయ్‌పూర్‌ తదితర ప్రాంతాల నుంచి అటవీ సిబ్బందిని కూడా అక్కడికి రప్పించారు.

చిరుత పట్టుబడే వరకు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఒంటరిగా బయటకు వెళ్లకుండా గుంపులుగా తిరగాలని, అవసరమైతే కర్రలు వెంట ఉంచుకోవాలని సూచించారు. చిన్నారులతో పాటు కొందరు గ్రామస్తులను ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
also read : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కలకలం.. ఒకే రోజు 10 మంది నవజాత శిశువుల మృతి

తాజావార్తలు