ఐఫోన్ ఈఎంఐ చెల్లింపు విషయంలో తలెత్తిన కుటుంబ వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. కుమారుడు ఆత్మహత్యకు ప్రయత్నించకుండా అడ్డుకునేందుకు వెళ్లిన తల్లిదండ్రులు కూడా కొండపై నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో హృదయాలను కలచివేస్తోంది.
ఝల్తా గ్రామానికి చెందిన 19 ఏళ్ల కునాల్ చంద్గుడేకు ఐఫోన్ ఈఎంఐ చెల్లింపు విషయంలో తండ్రి మురళీధర్‌తో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్ సమీపంలోని కొండపైకి వెళ్లి ప్రమాదకరమైన అంచుపై నిలబడ్డాడు.
విషయం తెలుసుకున్న తల్లి సంగీత అక్కడికి చేరుకుని కుమారుడిని వెనక్కి రావాలని గంటల తరబడి వేడుకుంది. సమస్య ఏదైనా కలిసి పరిష్కరించుకుందామని కన్నీళ్లతో కోరింది. ఆమె నేలపై కూర్చుని, కుమారుడి కాళ్లపై పడుతూ ప్రాణాలు తీసుకోవద్దని వేడుకున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.
అయినప్పటికీ కునాల్ వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామ సర్పంచ్ కూడా అతడిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో తండ్రి మురళీధర్ కుమారుడిని అంచు నుంచి వెనక్కి లాగేందుకు ప్రయత్నించగా ఇద్దరి కాళ్లు పట్టుతప్పి కొండపై నుంచి కిందపడిపోయినట్లు సమాచారం.
భర్త, కుమారుడు ప్రమాదానికి గురైన దృశ్యాన్ని కళ్లముందే చూసిన సంగీత తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. అనంతరం ఆమె కూడా కొండపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ కుటుంబం నాలుగు నెలల క్రితమే ఆ ప్రాంతానికి వచ్చి నివసిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. స్థానికులతో వారికి పెద్దగా పరిచయాలు లేవని చెప్పారు. మరోవైపు, కుటుంబం నివసించిన ఇంటి వద్ద పెంపుడు కుక్క ఇంకా తన యజమానుల కోసం ఎదురుచూస్తున్న దృశ్యం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
also read: దృశ్యం 4పై అధికారిక ప్రకటన.. మరోసారి జార్జ్‌కుట్టిగా మోహన్‌లాల్
