ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల మనవరాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో 70 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో బాలిక గర్భం దాల్చినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం.. బాలిక మూడు నెలల క్రితం సికింద్రరావ్ ప్రాంతంలోని తన మేనమామ ఇంటి నుంచి తండ్రి వద్దకు వచ్చింది. అయితే జూన్ 20 నుంచి తన తాత నిజాముద్దీన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఇంట్లో తండ్రి లేని సమయంలో నిందితుడు బాలికను బెదిరించి ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భవతి అని తేలింది.
దీంతో కుటుంబ సభ్యులు బాలికను ప్రశ్నించగా.. తాత చేసిన దారుణం గురించి ఆమె వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాలిక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిజాముద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై సర్కిల్ ఆఫీసర్ అమిత్ పాఠక్ మాట్లాడుతూ.. బాలికను జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
also read: హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తొక్కిసలాట.. నలుగురు విద్యార్థులకు గాయాలు
