క్రైమ్ మిర్రర్ : నెలసరి సమస్యలతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన 17 ఏళ్ల బాలికను గర్భవతిగా నిర్ధారించడం కలకలం రేపింది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ నిర్వహించిన పరీక్షల్లో గర్భం లేదని తేలడంతో వివాదం తలెత్తింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది.
కళ్యాణ్-డోంబివ్లి ప్రాంతంలోని శాస్త్రి నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక నెలసరి సమస్యలతో చికిత్స కోసం చేరింది. అక్కడ కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే ఆమెకు పలుమార్లు గర్భధారణ పరీక్షలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పరీక్షల్లో బాలిక గర్భవతిగా ఉన్నట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఈ విషయం తెలిసి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బాలికను మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె గర్భవతి కాదని నిర్ధారణ అయింది. అనంతరం అక్కడే నెలసరి సమస్యకు చికిత్స అందించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన పరీక్షలు, వైద్య ప్రక్రియలపై బాలిక కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశం మున్సిపల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చకు రావడంతో మున్సిపల్ కమిషనర్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read : కొండల్ రెడ్డి పై గురి…!
