క్రైమ్ మిర్రర్ : సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నూర్జహాన్‌పేట గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త దాడి చేయడంతో ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సోమవారం రాత్రి గ్రామంలోని సీసీ రోడ్డుపై చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బానోతు రవి, అతని భార్య సునీత (36) మధ్య కొంతకాలంగా కుటుంబ విషయాలపై తరచూ వివాదాలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ రవి ఆమెను వేధించేవాడని, గతంలో పలుమార్లు బెదిరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సోమవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో సునీత తన కుమారుడు శ్రీశాంత్‌కు ఫోన్ చేసింది. భర్తతో గొడవ జరుగుతోందని, తనకు భయంగా ఉందని ఆమె కుమారుడికి చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత రాత్రి 9 గంటల సమయంలో రవి మరోసారి సునీతతో గొడవకు దిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆమెపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో సునీతను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తల్లి మృతి విషయం తెలుసుకున్న కుమారుడు శ్రీశాంత్ ఆసుపత్రికి చేరుకున్నాడు. అనంతరం తన తల్లి మృతికి కారణమైన తండ్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెన్‌పహాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుమారుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ జి. రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
also read : వరద ఉధృతికి కొట్టుకుపోయిన టీచర్.. స్థానికుల చొరవతో సురక్షితం
