నాటక, సినీ రంగాల్లో విశేష గుర్తింపు పొందిన సీనియర్ నటుడు, రచయిత యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం గుంటూరులోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు కళారంగంలో విషాదం నెలకొంది.
కృష్ణేశ్వరరావు గత ఏడాది నుంచి శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందినట్లు వెల్లడించారు.
‘ప్రచండ భారతం’ సినిమాతో కృష్ణేశ్వరరావు వెండితెరకు పరిచయమయ్యారు. నటుడిగా మాత్రమే కాకుండా రచయితగానూ తన ప్రతిభను చాటుకున్నారు. పలు సినిమాలకు కథ, మాటలు తదితర విభాగాల్లో రచనలు అందించడంతో పాటు కొన్ని చిత్రాల్లో నటించారు.
నాటకరంగంపై ప్రత్యేక ఆసక్తి కలిగిన ఆయన ఎన్నో నాటకాలను రచించి, దర్శకత్వం వహించి, నటించారు. రంగస్థలంపై వినూత్న ప్రయోగాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా పలు నంది అవార్డులు సైతం లభించాయి.
సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన సేవలను పలువురు కళాకారులు, ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. కృష్ణేశ్వరరావు మృతి తెలుగు కళారంగానికి తీరని లోటని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణేశ్వరరావు అంత్యక్రియలను బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
also read: భార్యపై అనుమానంతో భర్త నడిరోడ్డు పై దాడి.. భార్య మృతి
