-
కొత్త రాజకీయ శక్తులతో చీలనున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు
-
అధికార పక్షం కంటే ప్రతిపక్షం పైనే ప్రభావం
-
హస్తం పార్టీకే ఎక్కువ నష్టం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏ రాజకీయ పార్టీకి లాభం? ఏ రాజకీయ పార్టీకి నష్టం? దేశంలో యువతను ఆకర్షించే సరికొత్త ప్రత్యామ్నాయ శక్తులు బలపడుతున్నాయి. ఆన్లైన్ సక్కైరీల ద్వారా వెలుగులోకి వచ్చి వీధుల్లో నిరుద్యోగం, జాఫర్ లీకేజీలపై గళం విప్పుతున్న కాక్రోచ్ జనతా పార్టీ వంటి నవతరం ఉద్యమాలు.. బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోనే జన సూరజ్ వంటి పార్టీలు ప్రజల్లోకి వస్తున్నాయి.
ఈ తరుణంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకీకృతం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది కచ్చితంగా అధికార పార్టీకి లాభం చేకూర్చుతుంది. అధికారంలోకి రావాలనుకునే ప్రతిపక్షానికి ఇబ్బందికరంగా మారనుంది. ఈ లెక్కన దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇది నష్టపరిచే అంశమే.
-
ఏది జరిగినా బీజేపీకే లాభం..
జాతీయస్థాయిలో ఏది జరిగిన అది బిజెపికే లాభం అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే పుష్కర కాలానికి పైగా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఏర్పడడం సహజం. ఆ వ్యతిరేక ఓటును ఒక వేదికపై తెచ్చి సొమ్ము చేసుకోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పై ఉంది. కానీ కొత్త రకమైన ఉద్యమాలు, స్వతంత్ర ప్రత్యామ్నాయ రాజకీయ వ్యక్తులు పుట్టుకొచ్చినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు లో చీలిక కచ్చితంగా ఉంటుంది.
బిజెపికి వ్యతిరేకంగా పడే ఓట్లు ఒకటి కంటే ఎక్కువ పార్టీల మధ్య పంపిణీ కావడం వల్ల.. అధికార పక్షం చాలా సులువుగా గెలుపొందే అవకాశాలు మెరుగుపడతాయి. అందుకే దేశంలో తాజా పరిణామాలతో బిజెపి ఎటువంటి ఆందోళనకు గురికాకపోగా.. ఓట్ల సమీకరణతో ముందుకు సాగుతోంది.
-
భవిష్యత్తులో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా..
కొత్తగా పుట్టుకొస్తున్న ఈ ఉద్యమాలు, ఆన్లైన్ పార్టీలు తమ ఉనికి కోసం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకున్నా అది అంతిమంగా బిజెపికి లాభం. సంప్రదాయ రాజకీయాల్లో అవినీతి, కుటుంబ పాలన, పాతకాలం నాటి రాజకీయ శైలిని నిరసిస్తూ సరికొత్త సిద్ధాంతాలతో వచ్చిన యువనేతలు కాంగ్రెస్తో జతకడితే.. కచ్చితంగా అది విప్లవాత్మక ఇమేజ్ను డామేజ్ చేస్తుంది.
మార్పు తెస్తామన్న వారు కూడా పాత రాజకీయాలకే లొంగిపోయారు. మోసం చేశారు అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుంటుంది. అందుకే ఓటర్ సైతం ప్రత్యామ్నాయాల కంటే.. స్థిరమైన, బలమైన నాయకత్వం కలిగిన భారతీయ జనతా పార్టీ నయం అనే ముగింపునకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన కొత్త తలనొప్పులు సృష్టిస్తాయి.
