Homeఆంధ్ర ప్రదేశ్క్యాబినెట్ లోకి కొణతాల...!

క్యాబినెట్ లోకి కొణతాల…!

  • జనసేనకు మరో ఛాన్స్

  • సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

  • మంత్రివర్గ విస్తరణలో అనకాపల్లి ఎమ్మెల్యేకు అవకాశం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి రెండేళ్ల పాలన పూర్తయిన తరుణంలో సీఎం చంద్రబాబు మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారని ప్రచారం సాగుతోంది. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేసి పాలనపై దృష్టి పెట్టాలని చూస్తున్నారు. ఇది కొలిక్కి వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది.

అయితే ఈసారి జనసేనకు ప్రాతినిధ్యం పెంచుతారని తెలుస్తోంది. ప్రధానంగా మెగా బ్రదర్ నాగబాబు తో పాటు ఉత్తరాంధ్రకు చెందిన కొణతాల రామకృష్ణకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన నాదేండ్ల మనోహర్.. గోదావరి జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేశ్ మంత్రులుగా ఉన్నారు. అందుకే ఈసారి కొణతాల రామకృష్ణకు అవకాశం కల్పిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.

  • పవన్ పిలిచి మరి..

సీనియర్ మోస్ట్ లీడర్ అయిన కొణతాల రామకృష్ణ దాదాపు కనుమరుగవుతున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ పార్టీలో చేర్పించి మరి అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఇప్పించారు. కూటమి బలంతో రామకృష్ణ గెలిచారు. దీంతో ఆయనకు క్యాబినెట్లో మంచి పదవి దక్కుతుందని అంతా భావించారు.

అయితే చంద్రబాబు సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లతో మంత్రివర్గాన్ని భర్తీ చేశారు. అయితే ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అవుతున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. కొంతమంది సీనియర్లను తీసుకుంటారని.. అందులో కొణతాల రామకృష్ణ ఒకరు అని ప్రచారం సాగుతోంది.

  • సీనియర్ మోస్ట్ లీడర్..

ఉమ్మడి ఏపీలోనే సీనియర్ నేత కొణతాల రామకృష్ణ. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు. యువజన కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1989లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.. టిడిపి అభ్యర్థి పెతకంశెట్టి అప్పల నరసింహం పై కేవలం 9 ఓట్ల తేడాతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టారు.

1991 లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా అనకాపల్లి ఎంపీగా గెలిచారు. 1996లో మూడోసారి పోటీ చేసి అయ్యన్నపాత్రుడు చేతిలో ఓడిపోయారు. 1999లో అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2004లో అదే అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు.

2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. అటు తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంలో కీలకంగా పని చేశారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం ఎప్పుడూ దిగలేదు. అయితే 2024 ఎన్నికల్లో అనూహ్యంగా జనసేనలో చేరిన కొణతాల ఎమ్మెల్యే అయ్యారు.

మరోసారి ఆయన సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయన ద్వారా పట్టు పెంచుకోవాలని చూస్తోంది కూటమి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు