రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఓ న్యాయవాది చేసిన చర్య, చివరకు ఊహించని నిజాలను బయటపెట్టింది.
స్థానికంగా న్యాయవాదిగా పనిచేస్తున్న ఆ వ్యక్తికి తన భార్యపై తీవ్రమైన అనుమానం కలిగింది. ఆమెకు వివాహేతర సంబంధం ఉండొచ్చని భావించిన భర్త, నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో భార్యకు తెలియకుండా బెడ్రూంలోని లైట్ ఫిట్టింగ్‌లో రహస్యంగా ఒక చిన్న కెమెరాను అమర్చాడు.
అయితే, కెమెరా అమర్చిన రెండు రోజులకే ఇంట్లో చోరీ జరిగినట్లు నాటకం మొదలైంది. బీరువాలో ఉన్న బంగారు నగలు కనిపించకపోవడంతో భార్య ఏడుస్తూ, దొంగలు ఇంట్లోకి చొరబడి ఆభరణాలు దోచుకెళ్లారని హడావుడి చేసింది.
భార్య ప్రవర్తనపై అనుమానం పెరిగిన భర్త వెంటనే కెమెరా రికార్డింగ్స్‌ను పరిశీలించాడు. ఆ వీడియోలు చూసిన తర్వాత అతను షాక్‌కు గురయ్యాడు. దొంగలు ఎవరూ బయటివారు కాదని, తన భార్యే ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా తెరిచి నగలను తీసి దాచినట్లు స్పష్టంగా కనిపించింది.
దీంతో వెంటనే పోలీసులను సంప్రదించిన భర్త, సీసీటీవీ ఫుటేజ్‌ను ఆధారంగా అందజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.
పోలీసుల ప్రశ్నలకు చివరకు ఆమె నిజం ఒప్పుకుంది. తన ప్రియుడికి అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో ఇంట్లోని బంగారు ఆభరణాలను దొంగిలించి అతనికి ఇచ్చినట్లు వెల్లడించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అనుమానంతో పెట్టిన కెమెరా, చివరకు దొంగతనంతో పాటు కుటుంబంలో దాగి ఉన్న రహస్యాలను బయటపెట్టడం విశేషంగా మారింది.
also read: “రెంట్ బాయ్‌ఫ్రెండ్” ట్రాప్‌పై హైదరాబాద్ పోలీసుల అలర్ట్ – యువతులు అప్రమత్తంగా ఉండాలని సూచన
