క్రైమ్ మిర్రర్ : బెంగళూరు శివారులో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మద్యం మత్తులో చేసిన హంగామా కలకలం రేపింది. అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపి స్థానికులను భయాందోళనకు గురిచేసిన టెకీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని అనెకల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన 40 ఏళ్ల అనురాగ్ తివారీ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్నాడు. బందాపూర్ సమీపంలోని సిపానీ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో గత కొంతకాలంగా అద్దెకు ఉంటున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం, ఘటన జరిగిన రోజు అనురాగ్ తివారీ ఫ్లాట్‌లో మద్యం సేవించిన అనంతరం మొబైల్ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అనంతరం బాల్కనీలోకి వచ్చి ఎయిర్ గన్‌తో కాల్పులు ప్రారంభించాడు. దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ కాల్పుల్లో అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో పార్క్ చేసిన వాహనాలు, ఇతర వస్తువులకు పెల్లెట్లు తాకాయి. కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకోగా, వారి వైపు కూడా కాల్పులు జరపడంతో వారు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న సూర్యనగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని అనురాగ్ తివారీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఎయిర్ గన్, పెల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సూర్యనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు గల కారణాలు, నిందితుడి ప్రవర్తనపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
also read : నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు.. ఏడుగురు అరెస్ట్
