Homeక్రైమ్కన్న కొడుకునే చంపేందుకు ప్రయత్నం.. హైదరాబాద్‌లో తండ్రి దారుణం

కన్న కొడుకునే చంపేందుకు ప్రయత్నం.. హైదరాబాద్‌లో తండ్రి దారుణం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై అతని తండ్రి దాడి చేయడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గోల్కొండకు చెందిన సల్మాన్ అనే వ్యక్తి తరచూ మద్యం సేవిస్తూ భార్యతో గొడవ పడేవాడు. కుటుంబ సమస్యలకు తన కుమారుడే కారణమని భావించి చిన్నారిని హతమార్చాలని పథకం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

బుధవారం ఉదయం బంధువుల ఇంటికి తీసుకెళ్తానని చెప్పి తన నాలుగేళ్ల కుమారుడు అర్మాన్‌ను ఇంటి నుంచి తీసుకెళ్లిన సల్మాన్.. ఆరాంఘర్ సమీపంలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వే వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ ఓ పిల్లర్ సమీపంలో చిన్నారిపై రాయితో దాడి చేసి, అనంతరం పిల్లర్‌కు తలను బలంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ దాడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సల్మాన్‌ను అడ్డుకున్నారు. అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

also read: పీవీ సింధు స్పోర్ట్స్ సెంటర్‌కు భూమిపూజ చేసిన మంత్రి లోకేశ్.. ఏపీలో క్రీడలకు మరో కొత్త అడుగు

తాజావార్తలు